యావత్తు ప్రపంచ నజర్ ఇపుడు బ్రిటన్ ప్రధాని ఎంపికపై నెలకొంది. యూకే ప్రధాని రేసులో తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే భారత సంతతికి చెందిన రిషి సునాక్ వెనుకంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతోన్న వేళ.. ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కీలకమైన టీవీ డిబేట్‌లో ప్రత్యర్థిపై రిషి పైచేయి సాధించారు. స్కై న్యూస్ నిర్వహించిన ‘బ్యాటిల్ ఫర్ నంబర్ 10’ టీవీ డిబేట్‌లో స్టూడియో ప్రేక్షకులు సునాక్‌కు మద్దతుగా నిలిచారు. టీవీ చర్చలో తాము ప్రధాని పదవికి ఎందుకు అర్హులమో ఇరువురూ వివరణ ఇచ్చారు. ద్రవ్యోల్బణం, పన్నుల తగ్గింపుపై అభ్యర్థులు తమ అభిప్రాయాలు, ఉద్దేశాలను వివరించారు.
ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ.. ‘‘పన్నుల తగ్గించడం కంటే ముందు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే మోర్టగేజ్ రేట్లు పెరుగుతాయి. మన పొదుపు, పెన్షన్లు అన్నీ కరిగిపోతాయి’’ అని అన్నారు. అనంతరం లిజ్ ట్రస్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘అధిక పన్నుల వల్లే బ్రిటన్‌లో మాంద్యం భయాలు నెలకున్నాయి.. దీనిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. అయితే, ట్రస్ వాదనతో ఏకీభవించని సునాక్.. ద్రవ్యోల్బణం వల్లే మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
ట్రస్, రిషి వాదనలు పూర్తయిన తర్వాత స్టూడియోలోని ఆడియన్స్‌కు పోలింగ్ నిర్వహించగా.. ఎక్కువ మంది రిషి సునాక్‌కు మద్దతుగా ఓటువేశారు. దీంతో ఈ డిబేట్‌లో సునాక్ విజయం సాధించినట్లు ప్రజెంటర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా టీవీ ప్రజెంటర్ కే బర్లీ వేసిన ప్రశ్నలు లిజ్ ట్రస్‌ను కొంత ఇరకాటంలో పడేశాయి. ఇటీవల ప్రభుత్వ వ్యయాలకు సంబంధించి ట్రస్ చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గిస్తే ఖజానాకు 8.8 బిలియన్ యూరోలు ఆదా అవుతాయని వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఈ ప్రకటనపై ఆమె యూటర్న్ తీసుకున్నారు. తాజా డిబేట్‌లో ప్రజెంటర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ట్రస్‌పై ప్రశ్నలు కురిపించారు.
‘ఉద్యోగుల వేతనాలపై మీరు చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు’ అని ప్రజెంటర్ అనగా.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్రస్ ఆరోపించారు. దీనికి బర్లీ స్పందిస్తూ.. ‘‘మంచి నేతలు తమ తప్పులను ఒప్పుకొంటారా? లేదా ఇతరులపై నిందలను నెట్టేస్తారా?’’ అని ప్రశ్నించారు. అయితే, తాను ఎవరినీ నిందించడం లేదని.. కొంతమంది మాత్రం తన ప్రకటనను తప్పుదోవ పట్టించారంటూ ఒకింత అసహనాన్ని ప్రదర్శించారు.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసిన వెంటనే కీవ్‌కు మద్దతుగా పోరాడేందుకు మద్దతు ఇస్తానని ట్రస్ చేసిన వ్యాఖ్యలను కూడా బర్లీ ప్రస్తావించారు. దీనికి ట్రస్ బదులిస్తూ.. డొనెట్స్క్ ప్రాంతంలో బ్రిటిష్ యోధులు అప్పటి నుంచి బంధీలుగా ఉన్నారు. కిరాయి సైనికులుగా దోషులుగా నిర్ధారించబడి మరణశిక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. రిషి సునాక్‌కు కూడా బర్లే క్లిష్టమైన ప్రశ్నలు సంధించినా.. ఆయన సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చారు. ‘‘మీరు మీ ప్రాడా షూస్‌తో నడుస్తున్నందున తాము వాడే సాధారణ బూట్లు ధరించి ఒక మైలు కూడా నడవలేరని ప్రజలు భావిస్తారు’’ అంటే.. నేనూ సాధారణ వైద్యుడి కుటుంబంలో పుట్టి పెరిగాను.. దీని గురించి మీరు వినే ఉంటారు అని అన్నారు.
ప్రధాని రేసులో లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు గురువారం ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 58 శాతం మంది లిజ్ ట్రస్‌కు, రిషి సునాక్‌కు 26 శాతం మద్దతు పలికారు. అయితే ఎంపీల్లో మాత్రం సునాక్‌కే మద్దతు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.