నగరంలోని ఓ యువకుడిలో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడంతో అధికార, వైద్య వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. గీతం వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న 22 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చాడు. అతను వచ్చినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుండడంతోపాటు శరీరంపై ఎర్రని దద్దుర్లు రావడం గుర్తించిన సహచర విద్యార్థులు కళాశాల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కళాశాలకు చెందిన వైద్యులు సదరు యువకుడిని పరిశీలించి శరీరంపై వున్న దద్దుర్లు, ఇతర లక్షణాలను బట్టి మంకీ పాక్స్‌గా అనుమానిస్తూ గీతం ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జునకు సమాచారం అందించారు.
దీంతో అప్రమత్తమైన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. వారు వెంటనే యువకుడిని పరిశీలించి నమూనాలు సేకరించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ (జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్ట్, మైక్రో బయాలజిస్ట్, మరో వైద్యుడు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది)ను నియమించి గీతం ఆస్పత్రికి పంపించారు. అయితే ఐసోలేషన్ వార్డులో యువకుడు లేకపోవడంతో గీతం అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన గీతం ఆస్పత్రి అధికారులు స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించినట్టు తెలిసింది. ఆస్పత్రి పరిసరాలు, కళాశాల ఆవరణలో యువకుడి కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ వెనక్కి వచ్చింది.