నాసాలో భారతదేశానికి చెందిన ఓ యువతికి అరుదైన అవకాశం దక్కింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి కేరళకు చెందిన అతిరా ప్రీతి రాణి ఎంపికయ్యింది. చిన్నతనం నుంచి అంతరిక్షానికి వెళ్లాలన్న తన కలను సాకారం చేసుకునే దిశలో అథిరా తొలి అడుగు వేసింది. ఈ శిక్షణను అథిరా విజయవంతంగా పూర్తిచేస్తే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న మూడో భారతీయ మహిళగా చరిత్ర సృషించనుంది. తిరువనంతపురానికి చెందిన వీ వేణు, ప్రీతిల కుమార్తె అయిన అతిరాకు చిన్నతనం నుంచి అంతరిక్షం, ఆస్ట్రోనాట్స్ అంటే ఆసక్తి ఎక్కువ. తిరువనంతపురంలోని ఆస్ట్రానామికల్ సొసైటీ నిర్వహించే ఆస్ట్రా తరగతులకు హాజరవుతుండేది.
సంపాదించుకుంటూనే చదువు కొనసాగించాలని నిశ్చియించకున్న అతిరా.. పైలట్ అయితే సులభంగా తన లక్ష్యాన్ని చేరుకోడానికి సహకరిస్తుందని భావించింది. చిన్న వయసులోనే కెనడాలోని అల్గోనిక్విన్ కాలేజీలో స్కాలర్‌షిప్‌తో రోబోటిక్ కోర్సులో సీటు సాధించింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే అత్యధిక మార్కులతో కోర్సును పూర్తిచేసింది. ఇదే సమయంలో తాను ప్రేమించిన గోకుల్‌ను వివాహం చేసుకుని, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి కెనడాలో ఎక్సో జియో ఏరోస్పేస్ కంపెనీ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించింది.
ఈ సమయంలో ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్ కార్యక్రమం గురించి ఆరా తీసింది. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, నేషనల్ రిసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు సంయుక్తంగా నిర్వహించే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ (IIAS)ఆస్ట్రోనాట్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసి పలు పరీక్షలు, ఇంటర్వ్యూల అనంతరం ఎంపికయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 12 మందిని ఎంపిక చేయగా.. అందులో అతిరా ఒకరు. శిక్షణ మూడు నుంచి ఐదేళ్ల వరకూ ఉంటుంది. శిక్షణ తర్వాత బయో ఆస్ట్రోనాటిక్స్‌లో రిసెర్చ్ చేయాలనే కోరిక ఉందని అతిరా పేర్కొంది.