మీ చిన్నపిల్లలు ఏ వస్తువుతో...చేతిలో ఏం తీసుకొని ఆడుకొంటున్నారు ప్రతి తల్లిదండ్రలు వాటిని గమనిస్తుండాలని సూచించే ఘటన ఇటీవల జరిగింది. గతవిజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో బాలుడు ఐదు రూపాయల కాయిన్ మింగేశాడు. ఐదు ఏళ్ల బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ సుంకర రఘు వెంటనే బాలుడికి ఎక్సరే తీయించి.. అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించారు.
డాక్టర్ ఎండోస్కోపి విధానం ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న 5 నాణెంను జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు నాణెలను దూరంగా ఉంచడం మంచిది.. లేనిపక్షంలో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు చాలానే జరిగాయి.