ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో లీక్ వ్యవహారం ఏపీలో రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకొంది. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొందరు ఎంపీ మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో.. ఆయన పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనపై దుష్ప్రచారం చేస్తూ వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
తాను నాలుగేళ్లుగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నానని.. అప్పటినుంచి టీడీపీకి చెందిన వారు తనను టార్గెట్ చేశారని చెబుతున్నారు అనితారెడ్డి. తనను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఇప్పుడు మరీ నీచంగా ఎంపీ మాధవ్ పక్కన తన ఫొటో పెట్టి మార్ఫింగ్ చేశారన్నారు. ఇదంతా టీడీపీ కుట్ర అని.. ఆ పార్టీ కార్యాలయం నుంచే ఇదంతా జరుగుతోందన్నారు. లోకేష్ డైరెక్షన్‌లోనే కుట్ర జరిగిందని.. మహిళలను ఇంతలా వేధించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా రెండేళ్లుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తన భర్త ఫొటోను మార్ఫింగ్ చేసి వ్యక్తిగతంగా దూషించినా భరించానని.. ఇప్పుడు ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో ఆయన పక్కన, తన ఫొటోను పెట్టి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని మండిపడ్డారు. కొంతమంది జనసేన పార్టీ వారు కూడా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. కరీమ్, వేణు, చందు, నవీన్‌కుమార్, రమణ అనే ఐదుగురు తనను సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్తు తెలిపారు. తన ఫొటో మార్ఫింగ్ చేసిన, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారందరిపై చర్య లు తీసుకోవాలని కోరారు.