ప్రతి మనిషి జీవితంలో ఎన్నోవిషాదాలు ఉంటాయి...గొప్ప మలుపులు ఉంటాయి. బాలివుడ్ హీరో అమీర్ ఖాన్ జీవితంలోనూ ఎన్నో విషాదాలున్నాయటా. అమిర్ ఖాన్ ఓ గొప్ప నటుడిగా ఈ ప్రపంచానికి సుపరిచితుడు. బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్స్ అందించి, బాక్సాఫీసు వసూళ్లలో రికార్డులు సృష్టించిన వ్యక్తి. నటనలో వైవిధ్యాన్ని చూపించేందుకు తాపత్రయపడే కృషీవలుడు. నటుడిగా నిరూపించుకున్న ఆమిర్ ఖాన్.. తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు.
ఇటీవలే ‘హ్యుమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో పాఠశాలలో అవమానాలు ఎదుర్కొన్న విషయాన్ని పంచుకున్నారు. తమ కుటుంబం తీవ్ర అప్పుల్లో ఉండి, ఎనిమిదేళ్ల పాటు గడ్డు పరిస్థితులను చూసినట్టు చెప్పారు. స్కూల్లో ఆరో తరగతికి రూ.6, ఏడో తరగతికి రూ.7, ఎనిమిదో తరగతికి రూ.8 ఫీజు ఉండేదని ఆయన చెప్పాడు. ఆమిర్, ఆయన సోదరుడు, సోదరీమణులు ఎప్పుడూ సమయానికి ఫీజులు చెల్లించే వారు కాదు. దీంతో వారిని ఒకటి, రెండు సార్లు హెచ్చరించిన అనంతరం స్కూల్ అసెంబ్లీలో (ప్రేయర్ సందర్భంగా) ప్రిన్సిపల్ వారి పేర్లను పెద్దగా చదివేవారట. ఈ విషయాన్ని ఆయన చెప్పిన సందర్భంగా కన్నీరు ఆపుకోలేకపోయారు.
నిర్మాత తాహిర్ హుస్సేన్, జీనత్ హుస్సేన్ దంపతులకు ఆమిర్ ఖాన్ సంతానం. అమీర్ కు ఒక అన్నయ్య ఫైసల్ ఖాన్, ఇద్దరు అక్కలు ఫర్హత్ ఖాన్, నిఖత్ ఖాన్ ఉన్నారు. ఆమిర్ ఖాన్ 1973లో వచ్చిన యాదోన్ కి బారాత్ సినిమాలో బాల నటుడిగా కనిపించారు.