దేశంలోని పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకొన్న రుణ గ్రహితలు ప్రస్తుతం ఎనలేని భారాన్ని మోయాల్సి వస్తోంది. తాజాగా ఆర్బీఐ మూడు నెలల వ్యవధిలో రెపో రేటును 1.4 శాతం మేర పెంచడం రుణ గ్రహీతలపై చెప్పుకోతగ్గ భారాన్నే మోపింది. వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్) 7 శాతం దాటిపోవడంతో.. దాన్ని నియంత్రించడమే ప్రధానంగా మే నుంచి ఆగస్ట్ వరకు మూడు విడతలుగా ఆర్బీఐ రేట్లను పెంచింది. దీంతో రుణాలపై ఈఎంఐ భారం 15-20 శాతం వరకు పెరిగింది.
మే నెలలో 0.40 శాతం, జూన్ లో 0.50 శాతం, ఆగస్ట్ లో 0.50 శాతం చొప్పున రెపో రేటును ఆర్బీఐ పెంచింది. దీంతో రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్ల కాల వ్యవధికి 6.75 శాతం వడ్డీపై లోగడ రుణం తీసుకున్నారని అనుకుందాం. అప్పుడు నెలవారీ చెల్లించాల్సిన వాయిదా (ఈఎంఐ) రూ.38,018 అవుతుంది. మేలో 0.40 శాతం పెంపుతో రుణ రేటు 7.15 శాతం అయింది. దీంతో ఈఎంఐ రూ.39,216కు పెరిగింది. జూన్ లో 0.50 శాతం పెంపుతో రుణ రేటు 7.65 శాతానికి చేరింది. దీంతో ఈఎంఐ రూ.40,739 అయింది. ఇక ఆగస్ట్ లో రుణ రేటు మరో అరశాతం పెరిగి 8.15 శాతానికి చేరింది. ఫలితంగా రుణంపై ఈఎంఐ రూ.42,290 అయింది. ఈఎంఐ 10 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కానీ దీని మూలంగా దీర్ఘకాలంలో చెల్లించే మొత్తం గణనీయంగానే ఉంటుంది.
ఆర్బీఐ రెపో రేటును మరో 0.60 శాతం మేర పెంచడం ద్వారా ఈ ఏడాది చివరికి 6 శాతానికి తీసుకొస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ లో 0.35 శాతం, డిసెంబర్ లో పావు శాతం పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈఎంఐ మరో 5 శాతానికి పైనే పెరగనుందని తెలుస్తోంది.