ఈ రోజు రాఖీ పౌర్ణమి. ఈరోజున ప్రతి సోదరి తన ప్రియమైన సోదరుడి చేతికి రాఖీ కడుతుంది. తోబుట్టువుల బంధం అంటే ఆప్యాయత, ప్రేమ, ఎంతో నమ్మకం ఉన్న బంధం. అందుకే రాఖీ పండుగ రోజున అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ళు తమ గొడవలు మరచి సంతోషంగా పండుగ జరుపుకుంటారు. మన దేశంలో రక్షా బంధన్ ను పెద్ద పండుగగా జరుపుకుంటారు. సంప్రదాయం ప్రకారం ప్రతి సోదరి తన సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి, స్వీట్లు తినిపిస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సోదరులు తమ సోదరీమణులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ బంధం విశ్వాసం మీద ఏర్పడిన బంధం.
రాఖీ పౌర్ణమి గురించి అనేక పురాణ కథలు ఉన్నాయి. రామాయణం ప్రకారం రాముడు తన వానర సైన్యానికి పూలతో చేసిన రాఖీని కట్టాడు. ఇక ద్రౌపది శ్రీకృష్ణుడి చేతులకు రాఖీ కట్టింది. విష్ణుపురాణం ప్రకారం బలి రాజ్యాన్ని రక్షించడానికి విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టినప్పుడు, లక్ష్మి దైత్య రాజు బలిని సోదరుడిగా భావించి, అతని చేతికి రాఖీ కట్టింది. కానుకగా విష్ణువును స్వర్గానికి తిరిగి పంపమని కోరింది. సోదరి లక్ష్మి కోసం బలిరాజు సర్వస్వం విడిచిపెడతాడు.
రాఖీ అనేది త్యాగం యొక్క ప్రాముఖ్యత మాత్రమే కాదు. సామరస్య బంధాన్ని నిర్మించడం కూడా. కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్ తన స్వయం కృషితో హిందువులు మరియు ముస్లింల మధ్య రక్షా బంధన్ ఆచారాన్ని ప్రారంభించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఆయన చేసిన నిరసన అది. ఇప్పుడు రాఖీ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకే పరిమితం కాదు. ఈ బంధం ఐక్యత, స్నేహంలోనూ చోటు సంపాదించింది.