గతానికి భిన్నంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో అధునాతన శతఘ్నులతో సెల్యూట్ చేయనున్నారు. భారత్ లో 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ఆగస్టు 15న ఎర్రకోటపై జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏడాది ఆగస్టు 15న 21 శతఘ్నులతో గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. అయితే, అందుకోసం బ్రిటన్ లో తయారైన శతఘ్నులు వాడేవారు. కానీ, ఈసారి దేశీయంగా తయారైన అధునాతన శతఘ్నులతో ఎర్రకోటపై గన్ సెల్యూట్ నిర్వహించనున్నారు.
ఈ శతఘ్నులను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో) రూపొందించింది. ఈ ఏటీఏజీఎస్ (ఆర్టిలరీ గన్స్) శతఘ్నులను దేశ రక్షణ నిమిత్తం సరిహద్దుల్లో మోహరించారు. అయితే, గన్ సెల్యూట్ కోసం వీటికి కొన్ని మార్పులు చేశారు. ఇవి 155 ఎంఎం కేటగిరీ శతఘ్నులు. ఏటీఏజీఎస్ శతఘ్ని నుంచి వెలువడిన గుండు 48 కిలోమీటర్ల దూరం వరకు దూసుకుపోతుంది.