కడప జిల్లాలో భ్రూణ హత్యలు అరికట్టి ఆడపిల్లల శాతాన్నిపెంచాలని కలెక్టర్ వి. విజయ రామరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పిసి అండ్ పిఎన్‌డిటి జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లింగ నిర్ధారణపై ప్రభుత్వం నిర్దేశించిన చట్టాన్ని తూ. చా తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఆడబిడ్డను రక్షించుకోవాలంటే లింగ నిర్ధారణ పరీక్షలను నిరోధించాలన్నారు. ఆయా స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ జరిగినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్ల వద్దంటూ కుటుంబంలో ఎవరైనా వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆధారాలతో తమకూ తెలియజేయాలన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్ లను ఆసుపత్రులను తరచూ తనిఖీ చేసి నివేదికను సమర్పించాలని అన్నారు.