గత 2017 ఆగస్టు 15న దేశ ప్రజలను ఉద్దేశించి ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి శనివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆగస్టు 15న మోదీ తన ప్రసంగంలో ఏమేం హామీలు ఇస్తారోనని కూడా ఆయన సెటైర్లు సంధించారు.
2017 ఆగస్టు 15 నాటి ప్రసంగంలో మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను, వాటిని 2022 ఆగస్టు 15 కల్లా నెరవేరేలా చేస్తామని చెప్పిన వైనాన్ని ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి గుర్తు చేశారు. ఏటా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని నాడు మోదీ హామీ ఇచ్చారని స్వామి పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పారన్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తానని మోదీ ఇచ్చిన హామీనీ ఆయన గుర్తు చేశారు. చివరగా బుల్లెట్ రైలుపై ప్రధాని చేసిన వాగ్దానాన్ని స్వామి గుర్తు చేశారు.