విద్య, వైద్యం అన్నవి ఉచిత పథకాలు కావని .. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు విద్య, వైద్యం కోసం పెట్టే ఖర్చును ఉచిత పథకాలు, తాయిలాలుగా చూడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఉచిత పథకాలు, హామీలపై ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇటీవల వరుసగా కామెంట్లు చేస్తుండటం, ఈ అంశం సుప్రీంకోర్టుకు వరకు వెళ్లడం నేపథ్యంలో ఎంకే స్టాలిన్ శనివారం మాట్లాడారు.
‘‘విద్య, వైద్య రంగాలపై చేసే ఖర్చును ఎప్పుడూ ఉచితాలుగా చూడవద్దు. ప్రజలకు జ్ఞానాన్ని ఇచ్చేది విద్య, వారికి ఆరోగ్యాన్ని చేకూర్చేది వైద్యం, మందులు. ఈ రెండు పేద వర్గాల కోసం తగిన సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. ఇవి ఉచితాలు కాదు.. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు. వెనుకబడిన వర్గాలు, పేదలకు, ఆపదలో ఉన్నవారికి ప్రయోజనం కలిగించేవి..” అని స్టాలిన్ పేర్కొన్నారు.
ఇటీవల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉచితాలు వద్దంటూ చేసిన కామెంట్లను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘‘కొందరు వ్యక్తులు ఉచిత పథకాలు, హామీలు వద్దంటూ కొత్తగా సలహాలు ఇస్తున్నారు. అలాంటి వాటిని మేం పట్టించుకోబోం. ఈ అంశం గురించి నేను ఎక్కువగా మాట్లాడితే.. ఇది రాజకీయం అవుతుంది. అందుకే దీనిపై ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు..” అని స్టాలిన్ పేర్కొన్నారు.