వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీతో సహా.. ఇతర పార్టీలు కూడా తీవ్రంగా తప్పుబట్టాయి. స్వతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దేశాన్ని అవినీతి, వారసత్వం పీడిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అవినీతిని సహించకూడదని, అక్రమాలు చేసే వారిని అస్సలు క్షమించకూడదని ప్రధాని అన్నారు. దేశంలో అవినీతిని నిర్మూలిస్తేనే పేదల బతుకులు బాగుపడతాయన్నారు. అదే సందర్భంలో పార్టీల్లోని వారసత్వం గురించి ప్రస్తావించారు.
వారసత్వం అనేది రాజకీయాల్లోనే లేదని, అన్ని వ్యవస్థల్లోనూ ఉందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వం వల్ల సమర్థవంతమైన, ప్రతిభావంతులైన నాయకత్వం రావడం లేదన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన వారసత్వం, కుటుంబ పాలనలపై వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అయితే స్వతంత్ర దినోత్సవం రోజున రాజకీయాల గురించి మాట్లాడడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీతో సహా.. ఇతర పార్టీలు కూడా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. బీజేపీ పార్టీలో కూడా వారసులున్నారని విమర్శించారు. పార్టీల్లో వారసులున్నా, ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులున్నా.. అంతిమంగా ప్రజలదే తీర్పని, ఎన్నికల్లో బంధుప్రీతి పనిచేయదని అంటున్నారు. కేంద్రం ఒక కుటుంబంపై పోరాడుతోందని కాంగ్రెస్ నేత అల్కా లంబా మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అవినీతి సమస్యలపై పోరాడుతున్న కుటుంబంపై కేంద్రం కన్నెర్ర చేస్తుందని ట్వీట్ చేశారు.
ప్రధాని మాటలను టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ కూడా స్పందించారు. బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు రాజకీయ నేపథ్యం ఉందని, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు కూడా ప్రధాన పదవిలో ఉన్నారని గుర్తు చేశారు. అలాగే బీజేపీలోని అంతర్గత కలహాల వల్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. అయినా స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో రాజకీయాల ప్రస్తావన చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా అభిప్రాయపడ్డారు.