కరోనా వైరస్ తో యావత్తు ప్రపంచం మొత్తం అతలాకుతలమైనా మనదేశంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం పెనుమార్పలు సంభవిస్తున్నాయి. కరోనా సంక్షోభం తర్వాత దేశంలో నిర్మాణ రంగంలో వృద్ధి కనబడుతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నివాస గృహాలకు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో నిర్మాణ వ్యయం పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్లు, నివాస సముదాయల ధరల్లో ఐదు శాతం వార్షిక పెరుగుదల కనిపించిందని ఒక నివేదిక తెలిపింది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో గృహాల ధరలు గరిష్ఠంగా 10 శాతం పెరిగాయి. రియల్టర్ల అత్యున్నత సంస్థ ‘క్రెడాయ్’, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, డేటా అనలిటిక్ సంస్థ ‘లియాసెస్ ఫోరాస్’.. ఎనిమిది ప్రధాన నగరాల్లో నివాస సముదాయాల ధరల రిపోర్టును తాజాగా విడుదల చేశాయి. ఈ జాబితాలో ఢిల్లీ-ఎన్సీర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పూణె, అహ్మదాబాద్ ఉన్నాయి.
ఈ ఏడాది రెండో త్రైమాసికం (ఏప్రిల్-జూన్) సమయంలో దేశంలో నివాస ధరలు కరోనా మహమ్మారికి ముందు స్థాయులను అధిగమించాయని ఈ నివేదిక పేర్కొంది. ఇది డిమాండ్‌కు సరిపోయే సరఫరాను సూచిస్తోందని తెలిపింది. డేటా ప్రకారం, ఈ సంవత్సరం ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో అహ్మదాబాద్‌లో గృహాల ధరలు సంవత్సరానికి 9 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.5,927కి చేరుకుంది. బెంగళూరులో చదరపు అడుగుకు 4 శాతం ధర పెరిగి రూ.7,848కి చేరుకోగా, చెన్నైలో ఒక్క శాతం మాత్రమే పెరిగి చదరపు అడుగు రేటు రూ. 7,129కి చేరుకుంది.
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఏప్రిల్-జూన్‌లో చదరపు అడుగుకు రూ. 9,218 గా ఉంది. గతేడాది పోలిస్తే హైదరాబాద్ లో చదరపు అడుగు ధర 8 శాతం పెరిగింది. కోల్‌కతాలో నివాస ప్రాపర్టీల ధరలు కూడా 8 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 6,362కి చేరుకున్నాయి. అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్ అయిన ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో మాత్రం నివాస గృహాల ధరలు ఒక్క శాతమే పెరిగి చదరపు అడుగుకి రూ. 19,677 వద్ద ఒక శాతం మాత్రమే పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీర్ ప్రాపర్టీ మార్కెట్‌లో గృహాల ధరలు అత్యధికంగా పది శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 7,434కి చేరుకున్నాయి. పూణేలో జూన్ త్రైమాసికంలో గృహాల ధర 5 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ. 7,681కి చేరుకుంది.
నివాస సముదాయాల ధరల పెరుగుదలకు నిర్మాణ సామగ్రి రేట్లు, కూలీల వేతనాల పెరుగుదల ప్రధాన కారణమని క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు హర్ష్ వర్ధన్ పటోడియా పేర్కొన్నారు. గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు కారణంగా డిమాండ్‌పై స్వల్ప ప్రభావం ఉండవచ్చని, అయితే సెప్టెంబర్ నుంచి విక్రయాలు పెరుగుతాయని ఆయన అన్నారు.