తన డీపీలో నెహ్రు ఫోటో పెట్టుకోకపోవడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలను మమత తన ట్విట్టర్ డీపీగా ఉంచారు. అయితే, ఆ మహనీయుల ఫొటోలలో దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఫొటో లేకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వెస్ట్ బెంగాల్ పీసీసీ అధికార ప్రతినిధి అభిషేక్ బెనర్జీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... నెహ్రూ ఫొటోను ఉద్దేశపూర్వకంగానే మమత పెట్టుకోలేదని మండిపడ్డారు. ప్రధాని మోదీని సంతృప్తి పరచడం కోసమే నెహ్రూను తొలగించారని విమర్శించారు. తన కూతురు గీసిన ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. దేశ తొలి ప్రధానిగా ఎర్రకోట నుంచి నెహ్రూ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఆ చిన్నారి గీసింది. ఈ ఫొటోను షేర్ చేసిన అభిషేక్ బెనర్జీ... డీపీ నుంచి నెహ్రూను తొలగించగలరే కానీ... చరిత్ర నుంచి మాత్రం కాదని అన్నారు. తొలి స్వాతంత్ర్య దినోత్సవానికి సంబంధించిన చిత్రాన్ని గీసిన తన కూతురు... మీకు హిస్టరీకి సంబంధించిన కొన్ని బేసిక్స్ ను తన డ్రాయింగ్ ద్వారా గుర్తు చేయాలనుకుంటోందని ఎద్దేవా చేశారు.