అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలు కుమ్ముక్కై నకిలీ రైతులను నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేశారని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మొత్తం కొనుగోళ్లపై లెక్కలు తీస్తే ఎన్ని వేల కోట్లు కాజేశారో తేలుతుందన్నారు. ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు, విపత్తులకు రూ.6వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారి.. వేటికీ దిక్కు లేదన్నారు. ఆర్బీకే భవనాలకు అద్దెలు కూడా సరిగా చెల్లించరని.. ఈ పరిపాలనను మించిన విపత్తు మరొకటి లేదన్నారు.
ధాన్యం బస్తాపై రూ.200 వరకూ కమీషన్ గుంజుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు వైఎస్సార్‌సీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారాయని.. అసలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువుల మొత్తం ఎంత.. ఎంత మొత్తంలో ఎరువులు ఆర్బీకేల వద్ద ఉన్నాయి.. ఎంత మొత్తం ఆర్బీకేల ద్వారా ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. అలాగే ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పంట ఎంత? అందులో ఆర్బీకే ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం ఎంత? దానిలో రైతులకు పెట్టిన బకాయిలు ఎంత? అనే విషయాలపై ఈ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా కేంద్రాలు వైఎస్సార్‌సీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారాయని ఆయన విమర్శించారు. ఆర్బీకేలు రైతుల నుంచి సరిగా ధాన్యం కొనుగోలు చేయరని.. కొద్దో గొప్పో కొన్నా, రైతుకి వెంటనే వాటి డబ్బు చెల్లించరని ఆరోపించారు. ఎరువులు అధిక ధరలకు అమ్ముతారని.. రైతులకు ఎరువులపై స్వల్పకాలిక రుణం కూడా ఉండదు అన్నారు. రైతు మాత్రం డబ్బు చెల్లించే ఎరువులు కొనాలని.. పోనీ కావాల్సిన ఎరువులన్నీ ఆర్బీకేల్లో దొరుకుతాయా అంటే అన్నీ దొరకవని.. ఎప్పుడు చూసినా ఎరువుల కొరత ఉందన్నారు.