ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినీ ఇండస్ట్రీలో మరోసారి కలకలం రేపిన వర్మ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 08:42 PM

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సినీ ఇండస్ట్రీలో కలకలం రేపారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’, ఆదిత్య ధర్ తెరకెక్కిస్తున్న ‘ధురంధర్-2’ చిత్రాల మధ్య జరగబోయే బాక్సాఫీస్ పోరును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రెండు సినిమాల పోటీని ‘డేవిడ్ వర్సెస్ గోలియత్’ యుద్ధంతో పోల్చిన ఆర్జీవీ, భారీ బడ్జెట్‌ల కంటే కథలోని తెలివితేటలే గెలుస్తాయని తనదైన శైలిలో విశ్లేషించారు. అయితే ‘టాక్సిక్’ వంటి మాస్ సినిమాలు ప్రేక్షకులను మూర్ఖులుగా భావిస్తాయని, అదే ‘ధురంధర్-2’ వంటి చిత్రాలు మెదడుకు పని చెబుతాయని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి.సినిమా మేకింగ్‌లో ఉండే ‘క్రూర సత్యాల’ పేరుతో వర్మ చేసిన విమర్శలు కన్నడ సినీ అభిమానుల్లో అగ్గి రాజేశాయి. వందల కోట్ల బడ్జెట్‌తో హీరోలను దేవుళ్లుగా చూపించడం, ఫిజిక్స్‌కు సంబంధం లేని ఫైట్లు, చెవులు పగిలే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈలలు వేయించడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా 'కేజీఎఫ్-2' వంటి సినిమాలు మాస్‌లోని ‘డంబ్‌నెస్’ను టార్గెట్ చేశాయని, కానీ తక్కువ బడ్జెట్‌తో వచ్చి భారీ వసూళ్లు సాధించిన ‘ధురంధర్’ ప్రేక్షకులు మేధావులని నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహించిన యష్ అభిమానులు సోషల్ మీడియాలో వర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.వివాదం ముదరడంతో వెంటనే స్పందించిన ఆర్జీవీ, ‘రాక్షసులందరికీ నా సమాధానం ఇదే’ అంటూ మరో పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. తాను కేవలం రెండు రకాల సినిమా శైలుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే చెప్పానని, ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మార్చి 19న థియేటర్లలో లైట్లు ఆరిపోయినప్పుడు అసలు సిసలు ‘భారతీయ సినిమా’ ఏదో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. వర్మ వివరణతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తున్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం పోటీ రసవత్తరంగా మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa