ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తంగిరాల‌ను మ‌ర‌చిన సైరా....

cinema |  Suryaa Desk  | Published : Thu, Oct 03, 2019, 08:53 PM

‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విజ‌యోత్సాహంలో ఉన్న మెగా కుటుంబం... అస‌లు ఈ చిత్రానికి ఆద్యుడైన  ఓ ప్రొఫెసర్‌కు అన్యాయంచేసారంటూ సామాజిక మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాలు ఔరా అనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే  ప్ర‌ముఖ సాహితీ ప‌రిశోధ‌కుడుఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు  ‘తెలుగు వీరగాథలు’ అనే అంశంపై పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టా పొందార‌ని, తంగిరాల 1965 డిసెంబర్ నుంచి 1966 ఏప్రిల్ వరకు రేనాటి సీమ(కడప, కర్నూలు)లో పర్యటించి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సంబంధించిన అనేక విషయాలు, జానపద గేయాలు, వీరగాథలు సేకరించారని వెల్లడించారు  తంగిరాల మిత్రుడు, పద్యకళా పరిషత్తు అధ్యక్షుడు ఎం. రామచంద్రప్రసాద్. 


1969 జూన్ నెల భారతిలో ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ అనే వ్యాసాన్ని తంగిరాల   రాసార‌ని గుర్తు చేసుకున్నారు. దీని వ‌ల్లే ఉయ్యాలవాడ గురించి ప్ర‌పంచానికి తెలిసిందని చెప్పారు. ఆపై ఆచార్య తంగిరాల మరిన్ని పరిశోధనలు జరిపి, 1999లో ‘రేనాటి సూర్యచంద్రులు’ అనే బృహద్గ్రంథాన్ని ప్రచురించారని చెప్పారు. ఇందులో నరసింహారెడ్డికి సంబంధించిన ఎన్నోవిషయాలపై ప్ర‌స్తావించార‌ని  తెలిపారు.


అయితే  సైరా చిత్రానికి స‌హాయ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన‌ రామ్మోహనరావు, పరుచూరి బ్రదర్స్ అసిస్టెంట్  గా ప‌నిచేస్తున్న బాలాజీ (దాము)  2017లో ఆచార్య తంగిరాలను సంప్రదించి ‘రేనాటి సూర్యచంద్రులు’ పుస్తకాన్ని, ఒక్కొక్కరు ఒక్కో కాపీ తీసుకొని వెళ్లారని తెలిపారు. ఈ విష‌య‌మై దీనిని సినిమాగా  తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారా అని తంగిరాల అప్ప‌టిలో ప్రశ్నిస్తే.. లేదు... సీరియల్ తీస్తున్నామని ఒకరు, ఈ విష‌య‌మై పరిశోధన చేస్తున్నామని మరొకరు చెప్పారని..తరువాత పత్రికలలో చూస్తే చిరంజీవి గారు సినిమా తీస్తున్నారని తెలిసింద‌న్నారు. ‘సైరా’ అనే టైటిల్ కూడా తంగిరాల సేకరించిన పిచ్చుకుంట్ల పాటలో నుంచి తీసుకున్న నిర్మాత‌లు క‌నీసం తంగిరాల‌కు ఇవ్వాల్సిన గౌర‌వం ఇవ్వ‌క పోవ‌టంపై మండి ప‌డ్డారు. సినిమా వాళ్ల మహా మాయల్లో దీనిని మించిన మాయ మరొకటి లేదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రామచంద్ర ప్రసాద్ అన్నారు.


మూడు వందల కోట్ల రూపాయలతో సినిమా తీసి, దాని గురించి పరిశోధన చేసిన తంగిరాలకు మూడు రూపాయల విలువ కూడా ఇవ్వలేదని మండిపడుతూ  రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ‌రి చిరు కుటుంబం ఈ విష‌య‌మై ఏమంటుందో చూడాలి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa