'ఈశ్వర్'డి అనుగ్రహంతో.. 'పౌర్ణమి' నాడు సినిమాల్లోకొచ్చి.. మిత్రులకు 'బుజ్జిగాడు'గా.. శత్రువులకు 'రెబల్'లాగా.. అమ్మాయిలకు 'డార్లింగ్'లాగా.. సాధువులకు 'యోగి'లాగా.. కోపమొస్తే ఘాటు 'మిర్చి'లాగా.. ఇండస్ట్రీలో 'మిస్టర్ పర్‌ఫెక్ట్'లాగా... బాహువులతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన 'బాహుబలి' యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
తెలుగు సినిమా కీర్తిపతాకను ప్రపంచమంతా ఎగిరేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్రపంచ స్థాయి హీరో. ఈ ఘనత ప్రభాస్ కి ఊరికే వచ్చింది కాదు. ఆరడుగుల హైట్, హైట్ కి తగ్గ పర్సనాలిటీ, పర్సనాలిటీకి తగ్గ వాయిస్.. ఇవన్నీ కలగలిపి ఉన్న అసలు సిసలైన హీరో ప్రభాస్. తెలుగు సినిమా హీ మ్యాన్ గా, తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే రెబల్ స్టార్ గా ప్రభాస్ ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది. మరెంతో పట్టుదల ఉంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెరంగ్రేటం చేసిన ప్రభాస్ కోట్లాదిమంది అభిమానించే యంగ్ రెబల్ స్టార్ గా ఎలా మారాడు..? ఈశ్వర్ సినిమాతో హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి సాహో వరకు ప్రభాస్ ఎదిగిన తీరును పరిశీలిద్దాం...
ప్రభాస్ అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి. 2002లో ఈశ్వర్ తో తెలుగు సినిమా అరంగ్రేటం చేసి తన సత్తా ఏంటో రుచి చూపించిన ప్రభాస్ కు ఆ వెంటనే తీసిన రాఘవేంద్ర నిరాశపరిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ ఇమేజ్ ను మరింత పెంచేసింది. 2005 లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సూపర్ హిట్ కావడంతో ప్రభాస్ రేంజ్ తిరిగి ఒక్క అడుగు నుండి వంద అడుగులు వేసింది. 2010లో వచ్చిన డార్లింగ్, 2011 రిలీజైన మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలు హిట్ కావడంతో.. ఇండస్ట్రీలో ప్రభాస్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ క్లాస్ హీరోగా ప్రభాస్ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత విడుదలైన రెబల్ హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. అనంతరం విడుదలైన మిర్చి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
రెండో సారి రాజమౌళితో జతకట్టిన ప్రభాస్ కి బాహుబలితో తన ఇమేజ్ మాత్రమే కాదు, తెలుగు సినిమా ఇమేజ్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. బాహుబలి సినిమా ముందు, తర్వాత అనే రేంజ్ లో తెలుగు సినిమా స్థాయి మార్కెట్ పెరిగింది. అంతర్జాతీయంగా చైనా తో సహా పలు దేశాల్లో బాహుబలి సూపర్ సక్సెస్ సాధించింది. తరువాత వచ్చిన సాహో సినిమా అంతగా విజయవంతం కాలేకపోయింది. తెలుగు సినీ హీరోలలో ఎవరికి దక్కని అరుదైన గౌరవం ప్రభాస్ కు మాత్రమే దక్కింది. ప్రభాస్ మైనపు ప్రతిమను 2017లో బ్యాంకాక్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిష్టించారు. తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ప్రభాస్ కు అభిమానుల తరుపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు...మీరిలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీరంగానికి మరిన్ని సేవలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa