సినిమా ప్రేమికులకు సంక్రాతి పండగ ఈసారి ముందుగానే రానుంది. సంక్రాతి సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. పండగ సందడిలో వసూళ్లు బాగుంటాయనేది వాళ్ల నమ్మకం. డిసెంబరు ఆఖరులోనూ ఒకటో రెండో సినిమాలు వస్తుంటాయి. అయితే ఈసారి క్రిస్‌మస్‌కు ఏకంగా నాలుగు సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చేయబోతున్నాయి. అందులో రెండు పర భాష నుంచి వస్తుంటే... మరో రెండు మన సినిమాలు. సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే', కార్తీ 'దొంగ', బాలయ్య 'రూలర్', సల్మాన్ ఖాన్ 'దబంగ్ 3' ఉన్నాయి. డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకం. మరి వీటిలో క్రిస్‌మస్ కింగ్ అనిపించుకునేది ఎవరో?
చాలా రోజుల తర్వాత 'చిత్రలహరి'తో మంచి హిట్ కొట్టాడు సాయి ధరమ్ తేజ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సంవత్సరం ప్రారంభంలో వచ్చిన 'చిత్రలహరి' బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ అందుకుంది. ఇప్పుడు అదే జోరుతో 'ప్రతిరోజూ పండగే' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. కామెడీలో తనదైన మార్కును చూపిస్తూ.. చివరికి సందేశాన్ని అందించే మారుతీ దర్శకత్వంలో ఈ మూవీ వస్తోంది. సత్యరాజ్, సాయి ధరమ్ తేజ్‌కు తాతగా కనిపించనున్నారు. 'సుప్రీమ్'లో తేజ్‌కు జోడిగా నటించిన రాశీ ఖన్నానే ఈ చిత్రంలోనూ కథానాయిక. మరి ఈ హిట్ పెయిర్ కలయికలో వస్తున్న 'ప్రతిరోజు పండగ' మరో విక్టరీ కొడుతుందో లేదో చూద్దాం.
తన నటనతో తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు కార్తీ. ఇటీవల 'ఖైదీ'తో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కొద్ది రోజుల్లోనే మళ్లీ థియేటర్లలోకి 'దొంగ'గా రాబోతున్నాడు. మలయాళ 'దృశ్యం' దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 'దొంగ' తెరకెక్కడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు కార్తీ తొలిసారి తన వదిన జ్యోతికతో తెరపై కనిపించబోతున్నాడు. జ్యోతికకు సోదరుడిగా కార్తీ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. డిఫరెంట్ హెయిర్ కట్‌తో 'దొంగ'లో కార్తీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మరి అక్కా-తమ్ముడిగా జ్యోతిక, కార్తీ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో కొన్ని రోజుల్లో తేలబోతోంది.
తనదైన నటనతో అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరిస్తుంటాడు బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన 'జై సింహ' బాక్సాఫీస్ ముందు ఫర్వాలేదనిపించింది. మళ్లీ వీరి కలయికలో వస్తున్న 'రూలర్' వెండితెరపై మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి. బాలకృష్ణతో హిట్ జోడి అనిపించుకున్న సోనాల్ చౌహాన్ ఇందులో ఒక కథానాయికగా నటిస్తోంది. మరోనాయికగా వేదిక కనిపించనుంది. ఇప్పటికే స్టైలీష్ లుక్‌తో పోస్టర్లు, టీజర్లలో అదరగొట్టిన బాలయ్య సినిమాలో ఇంకెంత సందడి చేస్తాడో చూడాలి.
బాలీవుడ్ సినిమాలకూ.. టాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తెరపై ఓ పక్క సీరియస్ గా కనిపిస్తూనే మరో పక్క సినిమా హాల్‌లో నవ్వుల పువ్వులు పూయించడం సల్లూ భాయ్‌కే సొంతం. ప్రభుదేవా దర్శకత్వం వహించిన 'దబంగ్ 3' కిస్మస్ రేసులో ఉన్నానంటోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన మార్క్ వేసిన ప్రభుదేవా.. సల్లూ భాయ్‌తో కలిసి హిట్ కొట్టాలనుకుంటున్నాడు. కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండడంతో నార్త్‌తో పాటు సౌత్‌లోనూ సినిమాకి మంచి హైప్ వచ్చింది. సోనాక్షి సిన్హా అభినయం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్‌లో పోలీస్ పాత్రలో అదరగొట్టిన సల్మాన్.. వెండితెరపై ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa