ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘టచ్ చేసి చూడు’ మూవీ రివ్యూ

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2018, 02:10 PM

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ‘రాజా ది గ్రేట్’ సినిమాతో పలకరించాడు మాస్ రాజా రవితేజ. ఆ చిత్రం అతడికి మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఇప్పుడతను ‘టచ్ చేసి చూడు’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విక్రమ్ సిరికొండ అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా ఇది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:  కార్తికేయ (రవితేజ) పాండిచ్చేరిలో వ్యాపారం చేసుకుంటూ బతికే కుర్రాడు. అతడికి తన కుటుంబం అంటే ప్రాణం. వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తాడు. కుటుంబం కోసమే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన కార్తికేయ జీవితంలోకి పుష్ప (రాశి ఖన్నా) అనే అమ్మాయి వస్తుంది. ఆమెతో పెళ్లికి సిద్ధపడిన సమయంలోనే కార్తికేయ చెల్లెలు ఒక హత్యను చూసి.. ఆ కేసులో ప్రధాన సాక్షిగా మారుతుంది. ఆమె చూసిన హత్యకు సంబంధించిన నిందితుడికి కార్తికేయ గత జీవితానికి సంబంధం ఉంటుంది. కార్తికేయ ఒకప్పుడు పోలీస్ అని.. అతడికో ప్రేయసి కూడా ఉందని వెల్లడవుతుంది. ఇంతకీ కార్తికేయ గతమేంటి.. పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి కార్తికేయ పాండిచ్చేరిలో ఎందుకు బతుకుతున్నాడు.. అతడి ప్రేయసి ఏమైంది అన్నది తెర మీదే చూడాలి.


కథనం - విశ్లేషణ:  రవితేజ పోలీస్ క్యారెక్టర్ వేసిన ప్రతి సినిమా ‘విక్రమార్కుడు’ అయిపోదు. అలాగే వక్కంతం వంశీ అందించిన ప్రతి కథా ‘టెంపర్’ అయిపోదు. అందుకు ‘టచ్ చేసి చూడు’ రుజువుగా నిలుస్తుంది. బాగా పాతబడిపోయిన రొటీన్ కథ.. దానికి తగ్గట్లే సాగే కథనం.. ఒక కొత్త దర్శకుడి నుంచి ఆశించే ఏ కొత్తదనం లేని నరేషన్.. వెరసి ‘టచ్ చేసి చూడు’ ఏ రకంగానూ మెప్పించని సినిమాగా నిలుస్తుంది. గతంలో ఊహించడానికి కూడా భయపడే వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతూ.. వాటికి అద్భుత విజయాలు కట్టబెడుతున్న రోజుల్లో కొన్నేళ్ల కిందటే ఔట్ డేటెడ్ అనిపించే తరహా కథతో కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ చేసిన ప్రయత్నం ఎవరిని మెప్పించడానికో అర్థం కాదు.


రవితేజ చివరగా పోలీస్ పాత్రలో కనిపించిన సినిమా ‘పవర్’ కూడా రొటీన్ గా ఒక ఫార్ములా ప్రకారం నడిచేపోయే సినిమానే. అది ప్రేక్షకుల్ని పూర్తి స్థాయిలో ఏమీ మెప్పించలేదు. ఐతే అందులోని కొన్ని ఆకర్షణలు కలిసొచ్చాయి. సినిమా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. ఐతే అదే కథతో ఇప్పుడు సినిమా తెరకెక్కితే ఆ మాత్రం ఫలితం రావడం కూడా కష్టమేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి అంతగా మారిపోయింది. రొటీన్ కథలంటే పెదవి విరుస్తున్నారు. దాదాపుగా ‘పవర్’ ఫార్మాట్లోనే సాగిపోయే ‘టచ్ చేసి చూడు’ కొత్తదనం కోసం ఎంత వెదికినా వృథా ప్రయత్నమే అవుతుంది.


 


హీరో తన కుటుంబంతో కలిసి పరాయి రాష్ట్రానికి వెళ్లి అక్కడ పద్ధతిగా ఏదో పని చేసుకుంటూ బతుకుతుంటాడు  అక్కడ అతడికో రొమాంటిక్ ట్రాక్. ఎంత కవ్వించినా సైలెంటుగా ఉండే హీరోకు ఒక చోట కోపం నషాళానికి ఎక్కుతుంది. అతడిలోని ఒరిజినల్ బయటికి వస్తుంది. కట్ చేస్తే ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్. ఒక బలమైన కారణంతో హీరో మారిపోతాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోతాడు. క్లైమాక్స్ ముంగిట హీరో మళ్లీ పాత అవతారంలోకి వెళ్లిపోయి విలన్ల పని పడతాడు. పాతికేళ్ల నుంచి ఇలాంటి కథలు చూసి చూసి అలసిపోతూనే ఉన్నాం. మళ్లీ ‘టచ్ చేసి చూడు’లో కూడా ఇదే ఫార్మాట్లో సాగి.. ఈ స్టయిల్లో సాగే పదుల సినిమాల్ని గుర్తుకు తెస్తుంది.


ఎంత రొటీన్ కథ అయినా.. సినిమా ఒక ఫార్మాట్ ప్రకారం సాగిపోయినా.. కొంచెం ఎంటర్టైన్మెంట్ మత్తులో అయినా ముంచెత్తితే ప్రేక్షకుడు మన్నిస్తాడు. కానీ అసలు కథ మొదలవడానికి ముందు ప్రథమార్ధంలో సాగే రొమాంటిక్ ట్రాక్ ఎంటర్టైన్ చేయకపోగా విసిగిస్తుంది. చాలా పేలవంగా రాసిన ఈ ట్రాక్ ను.. అంతే పేలవంగా తెరకెక్కించారు. సినిమా మీద ఆసక్తిని ఈ ఎపిసోడే సగం చంపేస్తుంది. ఇంటర్వెల్ ముంగిట హీరోలోని ఒరిజినల్ క్యారెక్టర్ బయటికొచ్చే సీన్ కూడా తేలిపోయింది. ఇక ద్వితీయార్ధం మొత్తాన్ని దాదాపుగా ఫ్లాష్ బ్యాకే ఆక్రమిస్తుంది. గంట నిడివితో సాగే ఈ ఫ్లాష్ బ్యాక్ లోనూ కొత్తదనం ఏమీ కనిపించదు.


ఇలాంటి పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్లు.. ఎలివేషన్లు బోలెడు చూసి ఉంటాం. ముఖ్యంగా ఇందులో చాలా సీన్లు ‘విక్రమార్కుడు’ సినిమాను గుర్తుకు తెస్తాయి. ఆ సినిమాను తలుచుకున్నాక ఇవి చాలా మామూలుగా అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే రవితేజ నుంచి ఆశించే మాస్ అంశాలు అతడి అభిమానుల్ని.. మాస్ ప్రేక్షకుల్ని కొంత అలరించవచ్చు. ఫ్లాష్ బ్యాక్ ను ముగించే సన్నివేశంలో లాజిక్ కనిపించదు. ఆ ఎపిసోడ్ ముగియడానికే చాలా సమయం పట్టడంతో వర్తమానంలోకి వచ్చాక వెంటనే హడావుడి క్లైమాక్స్ తెచ్చి పడేశారు. అదేమంత ఆకట్టుకోదు కూడా. లెక్కలేనన్ని మైనస్ పాయింటున్న ‘టచ్ చేసి చూడు’లో పాజిటివ్ గా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు.


నటీనటులు: రవితేజకు ‘టచ్ చేసి చూడు’ ఏ రకంగానూ ప్రత్యేకమైన సినిమా కాదు. నటన పరంగా మాస్ రాజా నుంచి ఏ కొత్తదనం కనిపించలేదు. ఒక్క ష్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వరకు ఓకే అనిపించాడు. ప్రథమార్ధమంతా రవితేజ ముద్ర ఏమీ కనిపించదు. పైగా అతడి లుక్ తేడాగా ఉండి.. కనిపించిన ప్రతిసారీ ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. హీరోయిన్లిద్దరి పాత్రలూ వృథాగా అనిపిస్తాయి. ఉన్నంతలో రాశి ఖన్నా మేలు. గ్లామర్ పరంగా అయినా ఆమె ఆకట్టుకుంటుంది. సీరత్ కపూర్ కపూర్ అయితే ఏ రకంగానూ మెప్పించదు. ఆమె నటన.. తన లుక్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. విలన్ పాత్రల్లో కనిపించిన వాళ్లు తేలిపోయారు. మురళీశర్మ.. జయప్రకాష్ పర్వాలేదు. 


మూవీ రివ్యూ : 2.5/5






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa