‘ఫిదా’ చిత్రంతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించాడు మెగా హీరో వరుణ్ తేజ్. కెరియర్ స్టార్టింగ్‌లో డిఫరెంట్ జానర్స్‌లో వైవిధ్య పాత్రలు చేసినా.. ఫిదా చిత్రంలో లవర్ బాయ్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో మళ్లీ ప్రేమకథా చిత్రంతోటే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వరుణ్ తేజ్, రాశీఖన్నా హీరో హీరోయిన్లుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తొలిప్రేమ’ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది. అయితే ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌లో ప్రిమియర్ షోలు పడటంతో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. 1998లో విడుదలై ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే టైటిల్‌ను వరుణ్ తేజ్ తీసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు వచ్చేశాయి. అయితే ఇటీవల జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్‌లో వరుణ్ మాట్లాడుతూ.. బాబాయ్ ‘తొలిప్రేమ’ చిత్రానికి ఉన్న పేరును నా సినిమాతో చెడగొట్టను అంటూ ఫ్యాన్స్‌ను మాట ఇచ్చాడు వరుణ్. అయితే ఈ మూవీని చూసిన ప్రేక్షకులు వరుణ్ ఇచ్చిన మాట ప్రకారమే వరుణ్ ‘తొలిప్రేమ’ పవన్ ‘తొలిప్రేమ’ చిత్రానికి ధీటుగానే ఉందని వరుణ్ కెరియర్ మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందంటూ యూఎస్ ఆడియన్స్ నుండి టాక్ వినిపిస్తుంది.
వరుణ్-రాశీ ఖన్నా కెమిస్ట్రీ అదుర్స్:
ఈ మూవీలో వరుణ్-రాశీఖన్నాలు ఆది, వర్షలుగా కనిపించారు. ట్రైన్ ప్రయాణంలో మొదలైన వీరి ‘తొలిప్రేమ’ బ్రేకప్ కావడం తరువాత యూకేలో మళ్లీ కలుసుకోవడం లాంటి కథనంలో ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీని బ్యూటిఫుల్‌గా చూపించాడు వెంకీ అట్లూరి. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్ సాగిన కథలో ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. సెకండాఫ్ మీద మూవీ డిపెండ్ అయ్యింది. ఆది-వర్షల మధ్య రొమాంటిక్ సీన్స్, లవ్‌లో ఉండే స్వీట్ మొమొరీస్.. ముఖ్యంగా వీరద్దరి మధ్య ఉంటే లిప్‌లాక్ సీన్ ‘తొలిప్రేమ’ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యాయి.
అందాల రాశీఖన్నా వర్ష పాత్రలో మెరిసింది. ట్రైన్‌లో రాశీఖన్నాను చూసిన వరుణ్‌తేజ్.. వెంటనే రైలెక్కి ఆమెను వాటేసుకోవడం.. ‘ఇంత అందంగా ఉన్నావేంటి’ అని అడగ్గానే అవాక్కైన రాశీఖన్నా వరుణ్ చెంప ఛెళ్లుమనిపించడం కొత్త ఫీల్ కలిగిస్తోంది. ‘కలగా నా జీవితంలోకి వచ్చావ్. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్.. మళ్లీ ఇలా మెరిశావ్. కలో నిజమో అర్థం కావడంలేదు’ అంటూ తన ప్రేమభావాల్ని బాగా పలికించాడు వరుణ్.
సినిమా మొ.త్తం కలర్ ఫుల్‌గా.. ప్రేమపులకరింతలతో యూత్‌ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీతో పాటు తమన్ అందించిన నేపధ్య సంగీతం ‘తొలిప్రేమ’ చిత్రానికి ప్రేమజంటలను థియేటర్స్‌కి రప్పించేటట్లు చేస్తుంది. ‘జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పటికీ మనతోటే ఉంటాయి.. మోయక తప్పదంటూ’ ప్రేమభా.రాన్ని మోస్తూనే తన ‘తొలిప్రేమ’ ఎలా గెలుపించుకున్నాడో తెలియాలంటే థియేటర్స్‌కి వెళ్లాల్సిందే.