సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు.. సీరియల్స్ కు దర్శకత్వం వహిస్తూ దర్శకుడిగా ఎదిగాడు.. అతన్ని చూసినపుడు ఎవరూ ఈ స్థాయిలో ఊహించి ఉండరు.. భవిష్యత్తులో ఈయనే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేస్తాడని.. అసలు అపజయమంటూ లేకుండా తెలుగు ఇండస్ట్రీని నెంబర్ వన్ దర్శకుడిగా ఏలేస్తున్న ఆయనే ఎస్ ఎస్ రాజమౌళి. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. ఈ తరం దర్శకులెవరూ సాధించలేని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు రాజమౌళి. ఈయన ప్రతిభ మెచ్చి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది కేంద్రప్రభుత్వం. అక్టోబర్ 10 ఆయన 47వ ఒడిలోకి అడుగు పెడుతున్నాడు. 19 ఏళ్ల కింద దర్శకుడిగా మారిన ఈయన.. చేసిన 11 సినిమాలతో 11 అద్భుతాలు సృష్టించాడు.
రాజమౌళి.. ఈ పేరుకు టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలన్నింటిలోనూ సూపర్ క్రేజ్ వచ్చేసింది. స్టూడెంట్ నెంబర్ వన్ తో గురువు చాటు శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాజమౌళి. ఆ సినిమాకు రాఘవేంద్రరావ్ దర్శకత్వ పర్యవేక్షణ చేసినా.. తన మార్క్ మాత్రం తొలి సినిమాతోనే చూపించాడు రాజమౌళి. ఇక తర్వాత చేసిన సింహాద్రి ఓ సంచలనం. 29 ఏళ్ల వయసులో 20 ఏళ్ల వయసున్న ఎన్టీఆర్ తో రాజమౌళి చేసిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. అప్పట్లోనే 25 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఇక ఆ తర్వాత సై, చత్రపతి, విక్రమార్కుడు సినిమాలతో వరస విజయాలందుకున్నాడు. సింహాద్రి తర్వాత సరైన సక్సెస్ లేక నాలుగేళ్లు వేచి చూసిన ఎన్టీఆర్ కు యమదొంగతో అదిరిపోయే హిట్టిచ్చిన ఘనత రాజమౌళిదే. ఇక మగధీరతో మరోసారి తెలుగు సినిమా చరిత్రను కదిలించాడు దర్శకధీరుడు. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి బాలీవుడ్ వరకు వ్యాపించింది. ఈగతో రాజమౌళి చేసిన ప్రయోగం ప్రశంసలతో పాటు పైసల్ని కూడా బాగానే రాల్చింది.
ఇక బాహుబలితో రాజమౌళి సృష్టించిన సంచలనం ఎవరూ అంత త్వరగా మరవలేం. తెలుగుతో పాటు తమిళ, మళయాల, హిందీ.. ఇలా విడుదలైన ప్రతీభాషలో బాహుబలి సంచలనం సృష్టించింది. రెండు భాగాలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 2500 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. ఇందులో ఆయన సృష్టించిన గ్రాఫిక్స్ మాయాజాలం బాలీవుడ్ దర్శక దిగ్గజాల్ని సైతం ఆశ్చర్యంలో ముంచేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్, చరణ్ లాంటి సూపర్ స్టార్స్ తో మల్టీస్టారర్ చేస్తున్నాడు రాజమౌళి. 2021న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కూడా 300 కోట్లతో తెరకెక్కుతుంది. ఈయన ఇలాంటి పుట్టినరోజులతో పాటు ఇండస్ట్రీ రికార్డులు కూడా మళ్లీ మళ్లీ తిరగరాయాలని కోరుకుందాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa