ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవితో గొడవలన్నీ పక్కన పెట్టి..

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 05:13 PM

సినీ రంగంలో అజాత శత్రువులా ఉండేది శ్రీదేవి. మూడు తరాల నటీనటులు.. టెక్నీషియన్లతో పని చేసిన ఆమె చాలా వరకు అందరితోనూ కలివిడిగానే ఉండేది. కానీ ఒక్క జయప్రదతో మాత్రం ఆమెకు పడేది కాదు. వీళ్ల మధ్య ఎందుకు గొడవ వచ్చిందో కానీ.. అది రాను రాను తీవ్రమైంది. చాలా ఏళ్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండానే ఉండిపోయారు. చివరికి ఓ హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా కలిసిన వీళ్లిద్దరినీ ఒక గదిలో పెట్టి తాళం పెట్టి వెళ్లిపోయారట. అలా అయినా మాట్లాడుకుంటారేమో అని చూస్తే అదేమీ జరగలేదు. గంట తర్వాత తలుపు తెరిచి చూస్తే ఇద్దరూ దూరం దూరంగానే ఉన్నారు. అంతటి విభేదాలుండేవి వీళ్లిద్దరి మధ్య.


ఐతే ఇప్పుడు శ్రీదేవి హఠాన్మరణంతో జయప్రద కదిలిపోయారు. గత విభేదాలన్నీ పక్కన పెట్టి శ్రీదేవి గురించి గొప్పగా మాట్లాడారు. తమ మధ్య ఒకప్పుడు గొప్ప స్నేహం ఉండేదన్నారు. శ్రీదేవి లేదన్న నిజాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని.. ఎన్ని రోజులకు జీర్ణించుకుంటానో కూడా తెలియదని జయప్రద అన్నారు. తన కూతురు జాన్వి తెరంగేట్రం కోసం శ్రీదేవి ఎంతో తపించిందని.. కానీ అది చూడకుండానే ఆమె వెళ్లిపోయిందని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణ వార్త తెలియగానే ముంబయిలో వాళ్లింటికి వెళ్లిన జయప్రద.. నిన్న రాత్రి శ్రీదేవి పార్థివ దేహం రావడంతో ఉదయం అక్కడికి చేరుకుంది. ఆమె అంతిమయాత్రలో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa