ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ‌దేవికి టాలీవుడ్ ఘ‌న నివాళి

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 05, 2018, 12:26 PM

దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, అమల, కోటశ్రీనివాసరావు, కవిత, జీవిత, రాజశేఖర్‌, సి.కల్యాణ్‌, పి.సుశీల, నివేదాథామస్‌, బి.వి.ఎస్‌,ఎన్‌.ప్రసాద్‌, ఉపాసన, పరుచూరి గోపాలకృష్ణ, బాబూ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ సంద‌ర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”శ్రీదేవితో నాకు నలబై సంవత్సరాలుగా మంచి పరిచయం ఉంది. అలాంటి వ్యక్తి చనిపోయిందని తెలియగానే నాతో పాటు యావత్‌ భారతదేశం షాక్‌ అయింది. మా అమ్మాయితో చాలా సన్నిహితంగా ఉండేది. మంచి నటే కాదు.. మంచి హ్యుమన్‌ బీయింగ్‌. ఎంతో సరదాగా, సంప్రదాయంగా, నవ్వుతూ ఉండేది. సినీ పరిశ్రమ నుండి ఇంత మంది పెద్దలు వచ్చారంటే ఆమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. మన తెలుగు అమ్మాయి 70 సినిమాలకు పైగా బాలీవుడ్‌లో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. లమ్హే, చాందినీ సినిమాలను నేను, యశ్‌చోప్రాలు నిర్మించాం. మళ్లీ వచ్చే జన్మలో తెలుగు అమ్మాయిగానే పుట్టాలని కోరుకుంటున్నాను” అన్నారు.


సీనియ‌ర్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ – ”సాధారణంగా చచ్చినవారి కళ్లు చారడేసి అంటుంటారు. అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత వారిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం. కానీ శ్రీదేవి కళ్లు బ్రతికుండగానే చారడేసి కళ్లు అమ్మాయి అయింది. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమెతో నాలుగైదు సినిమాలే చేశాను. అద్భుతమైన నటి. కొన్ని క్యారెక్టర్స్‌ను ఆమె తప్ప మరెవరూ చేయలేరనిపించేలా నటించింది. మంచి సంస్కారం ఉన్న నటి. బొబ్బిలి బ్రహ్మాన్న సినిమాను హిందీలో తీసినప్పుడు తనే హీరోయిన్‌గా నటించింది. అడిగిన వెంటనే డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి నటించింది. నాతోనే కాదు.. తను నటించిన సినిమాల్లో అందరితో మంచి సహకారాన్ని అందించింది. అన్ని భాషల్లో నటించిన శ్రీదేవిగారు అన్నింటిలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.


ర‌చ‌యిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ – ”నేను లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు తను బాలనటిగా నటించిన బడిపంతులు సినిమా చూశాను. తను నటిగా 50 ఏళ్ల అనుభవాన్ని సంపాదించుకున్నప్పటికీ నేను తనను మొదటిసారి చూసిన చిన్నపిల్ల రూపమే మనసులో నిలిచిపోయింది. తనతో ‘అనురాగదేవత’ సినిమాకు మేం తొలిసారి కలిసి పనిచేశాం. రామానాయుడుగారు ఆమెను చిత్రసీమకు దేవతను చేస్తే.. ఎన్టీఆర్‌గారు అనురాగదేవతను చేశారు. అనుభవ పూర్వకంగా స్వర్ణోత్సవం జరుపుకోవాల్సిన నటి. మళ్లీ ఆవిడ పుట్టి మనకు కనపడాలని కోరుకుంటున్నాను” అన్నారు.


సీనియ‌ర్ న‌టి జయప్రద మాట్లాడుతూ – ”ఈరోజు మనసులో తెలియని బాధ. శ్రీదేవి నటిగా ప్రతి విషయంలో తనకు తానే పోటీగా నిలబడింది. మేం ఇద్దరం కలిసి తెలుగు, హిందీలో 15 సినిమాలకు పనిచేశాం. ఇద్దరి మధ్య హెల్దీ మధ్య కాంపిటీషన్‌ ఉండేది. తను నిజంగా ఈరోజు మన మధ్య లేదని అంటే నమ్మలేకుండా ఉన్నాను. తను పిల్లల విషయంలో కూడా ఎంతో కేర్‌ తీసుకునేది. జాన్వీని తనంతటి హీరోయిన్‌ను చేయాలనుకునేది.


అమల అక్కినేని మాట్లాడుతూ – ”శ్రీదేవిగారు బ్యూటీఫుల్‌, ఫాబులస్‌ ఆర్టిస్ట్‌. అనుకోకుండా ఆమె మనల్ని విడిచి పెట్టి పోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.


గాన కోకిల పి.సుశీల మాట్లాడుతూ – ”దేవలోకం నుండి వచ్చిన సుందరిలాగా మన ముందకు వచ్చి.. మనల్ని మరపించి మళ్లీ తన లోకానికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన కోసం పాట పాడాను. తను హీరోయిన్‌గా నటించిన సినిమాలకు నేను పాటలు పాడాను. మనకు తీపి గుర్తులను మిగిల్చి వెళ్లిపోయారు. ఆమె మనసుకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa