మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని పోలెండ్ అందాల భామ కరోలీనా బీలాస్కా సొంతం చేసుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్ హాల్ లో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో ఆమెనే న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించారు. అమెరికాకు చెందిన భారతీయ సంతతి ముద్దుగుమ్మ శ్రీసైని ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం తాను మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నానని, అందులోనే పీహెచ్ డీ చేస్తానని, దాంతో పాటే మోడల్ గానూ కొనసాగుతానని కరోలీనా చెప్పింది. తాను మోటివేషనల్ స్పీకర్ కావాలనుకుంటున్నానని తెలిపింది. మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ నుంచి కిరీటం తీసుకున్న వెంటనే.. ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ నిజాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘట్టాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది.