వివాదస్పద సినిమా ది కశ్మీర్ ఫైల్స్ తో వివాదానికి తెరతీసిన ఆ చిత్ర దర్శకుడు తాజాగా సిక్కు సంఘం నుంచి తీవ్ర విమర్శలను చవిచూశాడు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది ఢిల్లీ ఫైల్స్’ పేరుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించడంపై మహారాష్ట్ర సిక్కు అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. సాఫీగా సాగిపోతున్న సమాజంలో అశాంతి రేకెత్తించడం మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అగ్నిహోత్రి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.
‘ది ఢిల్లీ ఫైల్స్’ పేరుతో రూపొందించనున్న ఈ సినిమాలో 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లను చూపించనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అగ్నిహోత్రి మాత్రం కథాంశాన్ని బయటపెట్టనప్పటికీ మహారాష్ట్ర సిక్కు అసోసియేషన్ మాత్రం తీవ్రంగా స్పందించింది. సృజనాత్మక వ్యక్తీకరణ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం సిక్కు అల్లర్ల వంటి దురదృష్టకర విషాద ఘటనలను తెరకెక్కించడం తగదని హితవు పలికింది.
సిక్కు సమితి వ్యాఖ్యలపై స్పందించిన అగ్నిహోత్రి.. తన మనస్సాక్షి ప్రకారం సినిమాలు తీసే హక్కు తనకు ఉందని తేల్చి చెప్పారు. టైటిల్ తప్ప అందులోని కథాంశాన్ని బయటపెట్టబోనని స్పష్టం చేశారు. తాను భారతీయుడినని, తనకు నచ్చిన పద్ధతిలో భావాలను వ్యక్తీకరించే పూర్తి స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. తనకు నచ్చినట్టే చేస్తానని, ఎవరి డిమాండ్లకో, సంస్థలకో తాను సేవకుడిని కాదని అన్నారు.
తాను ఏం చేస్తున్నానో, ఎందుకు తీస్తున్నానో కూడా ఇప్పటివరకు ప్రకటించలేదని, ప్రజలు మాత్రం ఏవేవో ఊహించుకుంటున్నారని అగ్నిహోత్రి అన్నారు. అయితే, అంతిమంగా తాను ఎలాంటి సినిమా తీస్తానో, అది ఎలా ఉండాలో నిర్ణయించేది మాత్రం సీబీఎఫ్‌సీ మాత్రమేనని, దాని విడుదలకు అనుమతించాలా? వద్దా? అనేది అది చూసుకుంటుందని అన్నారు.
ఇదిలావుంటే కశ్మీర్ ఫైల్స్‌తో హైప్ తెచ్చుకున్న అగ్నిహోత్రి ఇప్పుడు 1984 అల్లర్ల వంటి మానవజాతి విషాదాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సిక్కు సంఘం ఆరోపించింది. సమాజంలో ఇప్పటికే వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు నిండిపోయాయని, ఇలాంటి సమయంలో చరిత్రలోని దురదృష్టకర ఘటనను వాణిజ్యపరమైన అంశాల కోసం తెరకెక్కించడమంటే అశాంతిని ప్రేరేపించడమే అవుతుందని వివరించింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో పరస్పర విశ్వాసాలు కలిగిన ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని, నాటి చీకటి అధ్యాయాన్ని మర్చిపోవడానికి సిక్కు సమాజం ప్రయత్నిస్తోందని పేర్కొంది.
అంతేకాదు, ఈ ఘటనలోని దోషుల్లో చాలా మంది చనిపోయారని, మరికొందరు జైలు జీవితం గడుపుతున్నారని తెలిపింది. ఆలస్యంగానైనా న్యాయం జరిగిందని పేర్కొంది. ప్రభుత్వం కూడా ఈ ఘటనపై పార్లమెంటులో క్షమాపణలు తెలిపిందని, ముగిసిన అధ్యాయాన్ని పట్టుకుని మళ్లీ తెరపైకి తెచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని సిక్కు అసోసియేషన్ హితవు పలికింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa