సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట' మే 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సిినిమా విడుదలైన తర్వాత తొలి 10 రోజుల పాటు టికెట్ రేటును రూ.45 వరకు పెంచుకోవచ్చని అనుమతులు ఇచ్చింది. దీనిపై శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ బడ్జెట్ చిత్రాలకు చెందిన వారు నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసి, టికెట్ రేట్లు పెంచాలని అభ్యర్థిస్తున్నారు. ఇటీవలే సర్కారు వారి పాట చిత్రానికి చెందిన యూనిట్ కూడా ప్రభుత్వానికి తమ వినతిని అందజేసింది. వారి అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు అందజేసింది.