అభిమాని డైరెక్టర్ గా మారి సినిమా చేస్తే వచ్చే రిజల్ట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. గబ్బర్ సింగ్, సర్కారువారిపాట సినిమాలతో ఈ విషయం పై పక్కా క్లారిటీ వస్తుంది. తనకు తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా చెప్పుకునే డైరెక్టర్ హరీష్ శంకర్, ఆయనతో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ తో పవన్ ను తిరిగి హిట్ ట్రాక్ లోకి తీసుకురావటమే కాక గబ్బర్ సింగ్ చిత్రాన్ని పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిపారు. రీసెంట్గా విడుదలైన సర్కారువారిపాట విషయంలోనూ అంతే. ఒక అభిమానిగా పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ ను ఎలా చూడాలనుకున్నాడో అలానే తెరపై చూపించి గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అలానే, మెగాస్టార్ కు డై హార్డ్ ఫ్యాన్ గా చెప్పుకునే వెంకీ కుడుముల ఈ ట్యాగ్ తోనే మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే మెగా ఛాన్స్ ను కొట్టేసాడు.
విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూకు వెంకీ కుడుముల హోస్ట్ గా వ్యవహరించారు. లోకేష్ కనగరాజ్ మీకు వీరాభిమానినని పలుమార్లు చెప్పారు. మరి తన అభిమాన నటుడితో లోకేష్ ఎలా సినిమా తీయగలిగారు? అని వెంకీ కమల్ ను అడగ్గా, కమల్ సమాధానమిస్తూ... స్టార్ హీరోను డైరెక్ట్ చెయ్యాలంటే వీరాభిమాని అనే ఒక్క ట్యాగ్ తగిలించుకుంటే సరిపోదు. మీ అభిమాన హీరో ట్రాక్ రికార్డ్ ను ఒకసారి నిశితంగా పరిశీలించాలి. దిగ్గజ డైరెక్టర్లు బాలచందర్, రాఘవేంద్రరావు గారు అప్పట్లో ఏం చేసారో, అందుకు బెటర్ వెర్షన్ ను చెయ్యగలగాలి.... అని కమల్ సమాధానం ఇవ్వడమే కాక, మెగాస్టార్ తో సినిమా డైరెక్ట్ చెయ్యనున్న వెంకీకి విలువైన సలహా ఇచ్చారు.