దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేష్ తర్వాత వచ్చిన హీరో రానా. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన "లీడర్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రానా అప్పటి నుండి కెరీర్లో ప్రయోగాలకు పెద్ద పీట వేస్తూ వచ్చారు. ఎలాంటి ఈగోలకు పోకుండా వేరే హీరోల సినిమాల్లో విలన్గా, స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ వచ్చారు. హీరోయిజం, ఫేమ్, స్టార్డం వంటి వాటికి దూరంగా ఉంటూ కేవలం కథ, కథనం, పాత్ర తీరుతెన్నులు నచ్చితే వెంటనే సినిమా చేసే వ్యక్తి రానా. పన్నెండేళ్ల సినీ కెరీర్ లో రానా హీరోగా చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. తొలి సినిమా లీడర్ తో మొదలుపెడితే, నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజి, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాలలోనే రానా హీరోగా నటించారు. ఇక మిగిలినవన్నీ విలన్గా, కామియో రోల్.. ఇలాంటి సినిమాలే.
రానా చేసిన కొత్త ప్రయోగం విరాటపర్వం. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం లో రానా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా జూన్ 17న విడుదల కాబోతుంది. ఈ మేరకు నిన్న సాయంత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ ఈవెంట్లో రానా మాట్లాడుతూ ఒక సూపర్ సెన్సేషనల్ న్యూస్ చెప్పారు. కెరీర్లో ఇప్పటి వరకు ప్రయోగాలు చేసుకుంటూ వచ్చిన రానా ఇకపై ప్రయాగాలకు ఫుల్ స్టాప్ చెప్పారు. ఇకపై తననుండి కేవలం ఫ్యాన్స్ ఇష్టపడే సినిమాలే వస్తాయని అభిమానులకు ప్రామిస్ చేసారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.