రాజమోళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ముఖ్యపాత్రలు పోషించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల కు పైగా వసూళ్లు సాధించి, భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గవ మూవీగా రికార్డులకెక్కింది. ఇటీవలే ఓటిటిలోకి అందుబాటులోకొచ్చిన ఆర్ ఆర్ ఆర్ ఒక ఇండియాలోనే కాదు సుమారు 56 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో విజృంభిస్తుంది.
అమెరికాలో రీరిలీజ్ ఐన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఓటిటిలో అందుబాటులోకొచ్చినప్పటికీ ఆర్ ఆర్ ఆర్ ను థియేటర్లో చూడటానికే ఆసక్తి చూపిస్తున్నారు. పలువురు అమెరికన్ విమర్శకుల నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. ఒక్క అమెరికన్ల నుండే కాదు ఆర్ ఆర్ ఆర్ మూవీకి పలువురు ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్, క్రిటిక్స్, వీక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. వీటిని ఆర్ ఆర్ ఆర్ మూవీ టీం ట్విట్టర్ లో పోస్ట్ చేస్తుంది.
ఇదిలాఉండగా, ఇజ్రాయెల్ లోని ప్రముఖ వార్తాపత్రికలో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి గొప్పగా అభివర్ణిస్తూ ఒక న్యూస్ ఆర్టికల్ ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ లో ముఖ్యంగా ఎన్టీఆర్ నటనను ప్రస్తావించారు. కొమరం భీముడిగా ఎన్టీఆర్ నటన టాప్ క్లాస్ గా ఉందని, హాలీవుడ్ ను తలదన్నేలా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారని, ఇంకా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి చాలా గొప్పగా చెప్పబడిన ఈ ఇజ్రాయెల్ ఆర్టికల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఆర్టికల్ కు "వాట్ హాలీవుడ్ హాస్ ఫర్ గాట్టెన్" అంటే ఏదైతే హాలీవుడ్ మర్చిపోయిందో అనే అర్ధంతో హాలీవుడ్ కన్నా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని మెచ్చుకున్నట్టు రాసిన ఈ ఆర్టికల్ నిజంగా ఆర్ ఆర్ ఆర్ కు దక్కిన అరుదైన గౌరవం.