రాజకీయాల కోసం సినిమాల నుండి కొంత విరామం తీసుకుని, తిరిగి సినిమాల్లోకి వచ్చిన దగ్గర నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రయిట్ తెలుగు సినిమాల కన్నా రీమేక్ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఆల్రెడీ ఆయా భాషల్లో ఆ సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి..వాటినే తెలుగులో రీమేక్ చేస్తే నిర్మాతలకు మంచి లాభాలు వస్తాయని పవన్ అభిప్రాయం. దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన "పింక్" సినిమాని తెలుగులో "వకీల్ సాబ్" గా రీమేక్ చేసి పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు . అలానే ఇటీవల పవన్ నటించిన కొత్త చిత్రం "భీమ్లానాయక్". ఈ సినిమా కూడా మలయాళ సూపర్ హిట్ చిత్రం "అయ్యప్పనం కోషియం" కు తెలుగు రీమేక్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సముద్రఖని డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం "వినోదయ సిత్తం" ను పవన్ తెలుగులో రీమేక్ చెయ్యాలనుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఇదిలాఉంటే, బాలీవుడ్ లో కూడా ఈ రీమేకుల హావా నడుస్తున్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్ వంటి వారు ఈ లిస్టులో ఉండగా, ఒకరి మీద మాత్రం బాలీవుడ్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఆమె ఎవరో కాదు.... లేట్ శ్రీదేవి తనయురాలు
జాన్వీ కపూర్. సినిమాల కన్నా పార్టీల్లో, మ్యాగజైన్ కవర్ పేజీలపై, ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా "గుడ్ లక్ జెర్రీ" అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న రిలీజవ్వగా, ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తమిళంలో నయనతార నటించిన "కొలమావు కోకిల" కు హిందీ రీమేక్. తదుపరి "మిలి" అనే లేడి ఓరియెంటెడ్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ ఐన "హెలెన్" అనే సినిమాకు హిందీ రీమేక్. సినీరంగానికి ఈ భామ ఎంట్రీ ఇచ్చిందే మరాఠీలో ట్రెండ్ సెట్ చేసిన "సైరట్" అనే రీమేక్ మూవీ "ధఢక్" తో. వరసగా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో జాన్విని అభిమానులు బాలీవుడ్ లేడి పవర్ స్టార్ గా అభివర్ణిస్తున్నారు.