మత్తు వదలారా, సేనాపతి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నరేష్ అగస్త్య మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. నరేష్ అగస్త్య ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అహ నా పెళ్లంట, పూల రంగడు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీరభద్రం చౌదరి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించనున్నారు. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో నరేష్ అగస్త్య సరసన జోడిగా శ్వేత అవస్తి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు వివి వినాయక్ తొలి క్లాప్ ఇవ్వగా, హీరో అల్లరి నరేష్ స్క్రిప్ట్‌ను అందజేశారు. అలీ కెమెరా స్విచాన్ చేశారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'దిల్ వాలా' అనే టైటిల్ ని లాక్ చేసారు. జయ దుర్గాదేవి మల్టీమీడియా మరియు డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్లపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత అందిస్తున్నారు.