రణ్‌వీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బ్రహ్మాస్త్ర ఫాక్స్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్స్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించిన భారీ చిత్రం ఇది. దీనికి అయన్ ముఖర్జీ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు.
3డీ ఫార్మెట్‌లో మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ కథా చిత్రం తొలి భాగం సెప్టెంబర్ 9వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
తమిళంలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్లలో భాగంగా బుధవారం మధ్యాహ్నం రణ్‌బీర్ కపూర్, నాగార్జున, దర్శకుడు రాజమౌళి చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక రాయపేటలోని సత్యం థియేటర్‌లో జరిగిన ఈ సమావేశంలో దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. తాను దర్శకుడిగా కాకుండా, చిత్ర సమర్పకుడిగా పాల్గొన్నానని తెలిపారు.
బ్రహ్మాస్త్రం ఈ ఏడాది ఇండియన్ సినీ చరిత్రలో ముఖ్యమైన చిత్రంగా ఉంటుందన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. దర్శకుడు అయన్ ముఖర్జీ ఒక కామిక్ పుస్తకంతో తనను కలిశారని తెలిపారు. తన పాత్ర నంది అస్త్రం నేపథ్యంగా ఉంటుందన్నారు. తనకు చిన్న తనం నుంచి ఇతిహాసాలంటే ఆసక్తి అని, ఈ నేపథ్యంలోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు.
నటుడు రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంస్కృతిని గౌరవించే సమాజంలో తాను ఈ చిత్రాన్ని తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర మూల కథను దర్శకుడు తనకు 10 ఏళ్ల క్రితం చెప్పారన్నారు ఈ చిత్రం తనకు చాలా ముఖ్యం అని చెప్పారు. బ్రహ్మాస్త్రం కొత్త అనుభూతిని కలిగిస్తుందని రణ్‌బీర్ కపూర్ తెలిపారు.