తనీష్ వికాస్ వశిష్ట హీరో , సహర్ కృష్ణన్ హీరోయిన్, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "అంతేలే కథ అంతేలే". మహారాజశ్రీ, లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అనంతపురం బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నివాస్ మాట్లాడుతూ.. రిధిమ క్రియేషన్స్ పతాకంపై అంతేలే కథ అంతేలే సినిమా నిర్మిస్తున్నాం. రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే ఒక కథ ఇది. ఇందులో అనేక భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. ఈ చిత్రాన్ని అనంతపురం, నల్గొండ, హైదరాబాద్‌లలో మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము' అన్నారు.హీరో తనీష్ మాట్లాడుతూ.. 'ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన పాత్ర ఇది. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకుల గుండెలు బరువెక్కుతాయి' అన్నారు.