తన సంగీతంతో ప్రేక్షకులకు మంత్ర ముగ్ధుల్ని చేసే రెహమాన్‌కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆస్కార్ అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఈ సంగీత మాంత్రికుడిని ఇండియన్స్ మాత్రమే కాకుండా విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. తమిళం నుంచి మొదలు ఇంగ్లిష్ వరకు అన్ని రకాల భాషల చిత్రాలకు సంగీతంతో పాటు తన గానాన్ని అందించిన రెహమాన్‌ను ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ఈ గౌరవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లోనూ రెహమాన్‌కు విశేష గౌరవం ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే కెనడా దేశంలోని వీధికి ఆయన పేరును నామకరణం చేయడం. కెనడా దేశంలోని మార్కమ్ అనే పట్టణంలో ఉన్న వీధికి రెహమాన్ పేరును పెట్టారు. ఇదిలా ఉంటే ఈ పట్టణ వీధికి రెహమాన్ పేరు పెట్టడం ఇదే తొలిసారి కాదు 2013లో ఓ వీధికి, తాజాగా మరో వీధికి రెహమాన్‌గా నామకరణం చేయడం విశేషం. ఒక భారతీయ వ్యక్తికి కెనడాలాంటి దేశంలో ఇంత గౌరవం దక్కడం నిజంగానే గొప్ప విషయం ఈ విషయమై ఏఆర్ రెహమాన్ స్పందించారు. వీధికి తన పేరు పెట్టడం పై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి గౌరవం దక్కుతుందని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని తెలిపారు.