హాలీవుడ్‌లో ప్రఖ్యాతి చెందిన కౌబాయ్ జాన్రాను తెలుగులోకి తీసుకువస్తూ కృష్ణ స్వంత నిర్మాణంలో తీసిన మోసగాళ్ళకు మోసగాడు, ప్రముఖ బ్రిటీష్ వ్యతిరేక విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాలు కృష్ణ కెరీర్‌కు మరింత సాయపడ్డాయి. భారీ బడ్జెట్‌లో తీసిన ఈ సినిమాలు నిర్మాణ దశలో ఉండగా పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని "విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు" పేరిట సినిమాగా తీస్తానని 1957లోనే ప్రకటించి, తర్వాత స్క్రిప్టును పక్కన పెట్టి ఎన్.టి.రామారావు తీయకుండా తాత్సారం చేస్తూండడంతో కృష్ణ నిర్మించాడు. ఎన్.టి.రామారావు కృష్ణను ఆ సబ్జెక్టు ప్రజాదరణ పొందలేదని, తీయవద్దని వారించినా వినలేదు.