అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న తాజా OTT షో 'ఫర్జీ' తో విజయ్ సేతుపతి ప్రేక్షకులను అలరించారు. ఈ వెబ్ సిరీస్ లో స్టార్ హీరో కామెడీ టైమింగ్ వీక్షకులను ఆకట్టుకుంది. హారర్ కామెడీ ఫ్రాంచైజీ యొక్క నాల్గవ చిత్రం అయిన ఆరణ్మనై 4 అనే చిత్రంలో బహుముఖ నటుడు ప్రధాన పాత్రలో నటించారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు సమాచారం. డేట్స్ సమస్య కారణంగా నటుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందని లేటెస్ట్ టాక్.
ఈ హారర్ ఫ్రాంచైజీ దర్శకుడు సుందర్ సి ఇప్పుడు నాల్గవ భాగంలో ప్రధాన పాత్రలో నటించనున్నాడని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మూడు భాగాలు తెలుగులో కూడా (చంద్రకళ, కళావతి, అంతఃపురం) విడుదలై మంచి వసూళ్లను సాధించాయి. మార్చి 2023లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.