తన భర్త రాహుల్ శర్మ నుంచి నటి ఆసిన్ విడాకులు తీసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఈ వార్తలపై తాజాగా ఆసిన్ స్పందించారు. ఆయా వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.''సమ్మర్ హాలీడేను ఎంజాయ్ చేస్తోన్న తరుణంలో కొన్ని నిరాధారమైన వార్తలు మా కంట పడ్డాయి. వాటిని చూశాక.. పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించిన ఆనాటి రోజులు మాకు గుర్తుకు వచ్చాయి. మేమిద్దరం విడిపోయామంటూ వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి కాస్త ఆలోచించి వార్తలు రాయండి. అద్భుతమైన హాలీడేలో ఇలాంటి వాటి కోసం ఐదు నిమిషాలు కేటాయించాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా'' అని ఆసిన్ పోస్ట్ పెట్టారు.
'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి'తో తెలుగు తెరకు పరిచయమైన ఆసిన్.. 'శివమణి', 'గజినీ', 'ఘర్షణ', 'పోకిరి' (తమిళ వెర్షన్), 'మజా', 'దశావతారం' వంటి దక్షిణాది చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'హౌస్‌ఫుల్ 2', 'లండన్ డ్రీమ్స్'.. ఇలా పలు హిందీ సినిమాల్లోనూ ఆమె కీలకపాత్ర పోషించారు. బాలీవుడ్‌లో నటిస్తోన్న తరుణంలోనే మైక్రోమ్యాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఈ జంట 2016లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఆసిన్ సినిమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా, తన భర్తతో దిగిన ఫొటోలను ఆసిన్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దీంతో ఆమె విడాకులు తీసుకోనుందంటూ ప్రచారం తెరపైకి వచ్చింది.