టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఏడాది పాటు సినిమాలు చేయకూడదని డిసైడ్ అయింది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ వ్యాధి నుంచి ఆమె కోలుకుంది. అయితే ఈ ఏడాది బ్రేక్ కాలంలో సమంత తన ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిని సారించనుంది. అడిషనల్ ట్రీట్మెంట్ తీసుకోనుంది.
తాజాగా ‘ఖుషి’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ముగుస్తోంది. మరోవైపు ‘సిటాడెల్’ షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. ఈ రెండు షూటింగులు పూర్తయిన తర్వాత ఆమె అన్ని కమిట్ మెంట్ల నుంచి ఫ్రీ అవుతుంది. సమంత సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే ఆమె పూర్తి ఆరోగ్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అభిమానులు ఆశిస్తున్నారు