మామూలుగా అయితే స్టార్ ల కొడుకులు, కూతుర్లు నటులుగా సినిమా ఆరంగేట్రం చేస్తూ ఉండేవాడు. అయితే ఇప్పుడు స్టార్ ల బావమరుదులు కూడా సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ 'మ్యాడ్' అనే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు. దీనికి కళ్యాణ్ శంకర్ అనే అతను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలాగే ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె, హారిక సూర్యదేవర నిర్మాతగా ఈ సినిమాతో పరిచయం అవుతోంది. ఆమెతో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య ఈ సినిమాకి సహ-నిర్మాత. ఈ 'మ్యాడ్' సినిమా కాలేజీ నేపథ్యంలో తీసిన సినిమా అని ఈ సినిమా టీజర్ చూస్తేనే అర్థం అవుతోంది. కాలేజీ క్యాంపస్ లో జరిగిన గొడవలు, విద్యార్థుల మధ్య భేదాభిప్రాయాలు, రాగింగ్, అలాగే కొంచెం రెండర్థాల మాటలు కూడా ఈ టీజర్ లో కనిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ తో పాటు, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అననతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఇంకా చాలామంది ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల 'ధమాకా' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.