తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో పాత్రల్లో నటించిన షకీలా తండ్రిది చెన్నై. తల్లిది నెల్లూరు. బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆమె తన వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడారు. ‘‘10వ తరగతి ఫెయిల్ కావడంతో నాన్న చితకబాదారు. ఆయన మేకప్‌మెన్ నన్ను సినిమాల్లో చేర్పిస్తానన్నాడు. అలా ఒకరోజు నేను సిల్క్ స్మితను చూశాను. నన్ను సిల్క్ స్మిత చెల్లెలిగా సెలక్ట్ చేశారు. సినిమాల్లో వెళ్లాక కొన్ని సినిమాల్లో బట్టలు విప్పేయమంటున్నారు. అదే నాన్నకు చెబితే ‘చేయనని చెప్పేయ్’ అని అనేవారు. కానీ అది అంత ఈజీ కాదు. నాన్న చనిపోయాక హాట్ రోల్స్ చేయడం మొదలుపెట్టా. డబ్బు బాగా సంపాదించి. ఇంటి అటకపై దాచేదాన్ని. మా అక్క అలా ఉంచితే ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్లు పట్టుకుంటారు అని చెప్పి మొత్తం దొచుకుంది. ఈ రోజు తను బావుంది. నేను మాత్రం ఏమీ లేనిదానిలా ఇలాంటి పరిస్థితిలో ఉన్నా. నేను తీసిన ఓ సినిమాకు సెన్సార్ చేయకుండా ఆపేశారు. దాంతో నాలుగేళ్లు ఖాళీగా ఉన్నా. ఆ సమయంలో దర్శకుడు తేజగారు పిలిచి అవకాశం ఇచ్చారు. నేను నేనుగా ఉండటమే నా బలం. సినీ కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి నాపై ఓ మార్కు పడిపోయింది. నన్ను ఆ కోణంలోనే చూస్తున్నారు. హాట్ అని నాపై ఉన్న మరక చెరిపేసి నాలో ఉన్న మరో మనిషిని జనాలకు చెప్పాలనే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చా. షకీలా అనే పేరును మరిచిపోయి షకీ అమ్మా అని పిలవాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు.