సినిమా హిట్టయితే.. ముందుగా పేరొచ్చేది దర్శకుడికే. ఓ సినిమా తీసి హిట్టు కొడితే... ఆ గుర్తింపు మొత్తం దర్శకుడే పట్టుకెళ్లిపోతాడు. అందుకే కెప్టెన్ అంటే అంత క్రేజ్. హీరోలు, నిర్మాతలు, సంగీత దర్శకులు, ఫైట్ మాస్టర్లు, డాన్స్ మాస్టర్లు, ఎడిటర్లు, ఆఖరికి కెమెరామెన్లు కూడా సినిమా కెప్టెన్ కావాలని తహతహలాడతారు. కమెడియన్లు కూడా అందుకు మినహాయింపు కాదు.ఇది ఇప్పటి మాట కాదు. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లినా.. దర్శకత్వం వైపుకొచ్చిన హాస్య నటులు పుష్కలంగా కనిపిస్తారు. పద్మనాభం, నగేశ్... ఇలా కొంతమంది కమెడియన్లు మెగాఫోన్ పట్టినవారే. కైకాల సత్యనారాయణ హీరోగా నగేశ్ రూపొందించిన ‘మొరటోడు’ ప్రశంసలు దక్కించుకొంది. పద్మనాభం కూడా దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ సెంటిమెంట్ ఈతరం వరకూ కొనసాగుతూనే ఉంది. చక్కటి హాస్య నటులుగా గుర్తింపు పొందిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, తనికెళ్ల భరణి వీళ్లంతా దర్శకత్వ బాధ్యతల్ని నెత్తిమీద మోసినవాళ్లే. హాస్య నటుడిగా తీరిక లేకుండా గడుపుతున్న సమయంలోనే వీళ్లంతా కెప్టెన్లయ్యారు. తనికెళ్ల భరణి.. ‘మిథునం’లాంటి మంచి చిత్రాన్ని చిత్రసీమకు అందించారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పేరు మార్మోగేలా.. ఓ మంచి సినిమా తీయాలన్నది ఆయన లక్ష్యం. ఎల్బీ శ్రీరామ్ అయితే.. కొన్ని మంచి కథల్ని లఘు చిత్రాలుగా తీసి, ఆ జోనర్‌లో తన ప్రభావం చూపిస్తున్నారు. ఈతరంలోనూ కొంతమంది హాస్య నటులు మెగాఫోన్‌పై మనసు పారేసుకొన్నారు. వెన్నెల కిశోర్ ‘వెన్నెల వన్ అండ్ ఆఫ్’ అనే సినిమాని రూపొందించారు. అవసరాల శ్రీనివాస్‌లో అయితే నటుడే కాదు... ఓ రచయిత, దర్శకుడు ఉన్నారు. దర్శకత్వం కోసం ఆయన యాక్టింగ్‌ని కూడా పక్కన పెట్టారు. మొన్నటికి మొన్న వేణు ‘బలగం’ సినిమా తీసి, తన బలం చాటుకొన్నారు. వేణు ఇచ్చిన స్ఫూర్తితో ‘జబర్దస్త్’ ధన్‌రాజ్ సైతం ఓ సినిమా తీస్తున్నారని తెలుస్తోంది. సముద్రఖని హీరోగా తెరకెక్కించే సినిమాతో ధన్‌రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దసరాకి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. జబర్దస్త్ నుంచి వచ్చిన హాస్య నటులు కిరాక్ ఆర్పీ, షైనింగ్ శాంతికుమార్ కూడా దర్శకులుగా రాణించాలని కలలు కంటున్నారు. ‘అమృతం’ అనే ధారావాహికతో పాపులర్ అయిన హర్షవర్థన్.. ఆ తరవాత కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు. ‘మనం’ చిత్రానికి ఆయన మాటలు రాశారు. ‘మామా మశ్చింద్ర’తో దర్శకుడిగా రాణించే ప్రయత్నం చేశారు.