హీరో విశాల్ మరోసారి సేవాభావాన్ని చూపించారు. ప్రస్తుతం అయన హరి దర్శకత్వంలో నటిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రం షూటింగ్ తూత్తుకుడి జిల్లాలోని విలాత్తికులం, కుమారచక్కణపురం, వీరకాంచీపురం, ఊశిమేసియాపురం వంటి గ్రామాల్లో 20 రోజులుగా షూటింగ్ జరిగింది. ఇందులో కుమారచక్కణపురానికి షూటింగ్ కోసం వెళ్ళగా, ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఉందన్న విషయాన్ని తెలుసుకున్న విశాల్ తక్షణం స్పందించారు. అప్పటికప్పుడు ఆ గ్రామంలో బోరుబావి తవ్వించారు. 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సింథటిక్ వాటర్ ట్యాంకులను అమర్చి, గ్రామస్తులంతా నీటిని బిందెల్లో పట్టుకునేందుకు వీలుగా ఆరు ట్యాప్‌లను ఏర్పాటు చేయించారు. దీంతో ఆ గ్రామ ప్రజలంతా విశాల్‌కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.