కేవలం పాటలతోనే జనాల్ని సినిమా థియేటర్లకు రప్పించిన సందర్భాలు కోకొల్లలు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు పాటలే బలం. విడుదలకు ముందే సినిమాకు పాజిటీవ్ టాక్ తీసుకురావడంలో పాటలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఓ పాట హిట్టయిందంటే.. సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ అయి కూర్చుంటోంది. ఆ పాటపైనే రీల్స్ నడస్తున్నాయి. అలా.. ఈమధ్య కొన్ని పాటలు జనంలోకి బాగా వెళ్లిపోయి.. మార్మోగిపోతున్నాయి. ఆయా చిత్రాలకు మంచి బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అవి ప్రేక్షకుల తీర్పుపై ఆధారపడి ఉంటాయి. అయితే... మంచి పాటల్ని సంగీత దర్శకుడి నుంచి రాబట్టుకోవడం మాత్రం దర్శకుడి చేతుల్లో ఉండే విషయమే. అందుకే ప్రీ ప్రొడక్షన్ దశలోనే మ్యూజిక్ సిట్టింగ్స్‌కి కావల్సినంత సమయం కేటాయిస్తారు. ఆల్బమ్‌లో ఒక్క పాట హిట్టయినా సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని అందరికీ తెలుసు. అందుకే ఆ ఒక్క పాట కోసం కుస్తీపాట్లు పడుతుంటారు. కొన్ని సినిమాలకు పాటల వల్లే మైలేజీ వస్తుంది కూడా. అలా జరిగితే.. సంగీత దర్శకుడు సక్సెస్ అయినట్టే.