‘జపాన్ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన చిత్రం. ఈ పాత్ర కోసం చాలా మారాను. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఆలోచనలో పడేస్తాడు జపాన్’’ అన్నారు కార్తి. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనూ ఇమ్మానియేల్ కథానాయిక. మురుగన్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఆర్.ప్రభు నిర్మించారు. దీపావళి సందర్భంగా విడుదల అవుతోంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యువ కథానాయకుడు నాని మాట్లాడుతూ ‘‘ఈగ విడుదలైన తరవాత తమిళనాడు ఎప్పుడు వెళ్లినా ‘నువ్వు మా తమిళ అబ్బాయిలానే ఉన్నావు’ అని నన్ను అంతా అభినందించేవారు. కార్తిని చూసినా నాకు అదే అనిపిస్తుంది. మన తెలుగు వాడు అనే ఫీలింగ్ వస్తుంది. తను కథల్ని ఎంచుకొనే విధానం బాగుంటుంది. ‘జపాన్’ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. దీపావళి వైబ్ కనిపించింద’’న్నారు. కార్తి మాట్లాడుతూ ‘‘జపాన్ పాత్ర కోసం రూపు రేఖల్ని మార్చుకొన్నాను. డైలాగ్ డెలివరీ కూడా మార్చాను. చివరి 20 నిమిషాల గురించి గొప్పగా చెప్పుకొంటున్నారు. ‘సర్దార్’ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ విడుదల చేసింది. మంచి పేరొచ్చింది. ఆ సినిమా చూసిన వెంటనే నాగ్ అన్నయ్య ఫోన్ చేసి అభినందించారు. పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ‘జపాన్’ చూసిన తరవాత కూడా నాగ్ అన్నయ్య నుంచి ఫోన్ వస్తుందని నా నమ్మకం’’ అన్నారు.