సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల చంద్రమోహన్ 1966 లో 'రంగులరాట్నం' అనే సినిమా ద్వారా చిత్రపరిశ్రమకి పరిచయం అయ్యారు. తన మొదటి సినిమా నుండే చంద్రమోహన్ ఒక మంచి నటుడిగా అనిపించుకుని కొన్ని దశాబ్దాల పాటు కొన్ని వందల సినిమాల్లో వివిధ రకాలైన, వైవిధ్యం వున్న ఎన్నో పాత్రలు చేశారు.అప్పట్లో చంద్రమోహన్ పక్కన ఏ నటీమణి చేసిన ఆమె అచిరకాలంలోనే పెద్ద స్థాయికి వెళ్ళిపోయేవారు. జయసుధ, జయప్రద , శ్రీదేవి, రోజారమని, ప్రభ, రాధిక, విజయశాంతి ఒకరేంటి చాలామంది ముందుగా చంద్రమోహన్ తో నటించి తరువాత చాలా పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళు. అందులో జయసుధ అయితే చంద్రమోహన్ తో చాలా ఎక్కువ సినిమాల్లో నటించారు, అలాగే అతన్ని తన కుటుంబలో ఒకరుగా భావించేవారు. 'చాలాసార్లు నేను చెప్పాను నా ఫేవరెట్ నటుడు చంద్రమోహన్ అని. అతను ఎటువంటి పాత్ర అయినా చాలా సునాయాసంగా చెయ్యడమే కాకుండా, ఆ పాత్రకి గొప్ప ఔన్నిత్యాని తెచ్చేవారు. నేను నిర్మాతగా మారి సుమారు ఏడు సినిమాలు చేసాను, అందులో అయిదు సినిమాల్లో చంద్రమోహన్ వున్నారు, అతను ఒక అద్భుత నటుడు. అటువంటి నటుడుని ఈరోజు మనం కోల్పోయాం, అది దురదృష్టం," అని చెప్పారు జయసుధ.