ఇప్పటి వరకు మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కే పరిమితమైంది. ఇప్పుడామె మరో స్టెప్ తీసుకుని.. ఫీచర్ ఫిల్మ్‌తో వెండితెరకు నిర్మాతగా పరిచయం కాబోతోంది. నిహారిక కొణిదెల సమర్పణలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా తదితరులు నటీనటులుగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి , శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్ర పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగాయి.ముహూర్తపు సన్నివేశానికి హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీ సహా చిత్ర యూనిట్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ వారు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. సేమ్ టైమ్ టెన్షన్‌గానూ ఉంది. యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మంచి టీమ్, కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాం. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ స్టెప్ వేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు