కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్గా నటించిన ‘ఉపేంద్రగాడి అడ్డా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఆర్యన్ కె సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు ఈ సినిమా నిర్మించారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన చిత్రం సక్సెన్ మీట్లో నిర్మాత మాట్లాడుతూ ‘మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో చూపించిన సందేశం అందరికీ చేరాలని నా కోరిక. మా బేనర్‌పై నిర్మించే అన్ని చిత్రాలూ కంటెంట్ ప్రాధాన్యంగానే ఉంటాయి. అలాగే ప్రతి సినిమాలో ప్రజలకు పనికి వచ్చే సందేశం తప్పకుండా ఉంటుంది. ఉపేంద్రగాడి అడ్డాను తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. తుపాన్ తగ్గగానే చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తాం. అలాగే హిందీలో రిలీజ్ చేయడానికి హక్కులు అడిగారు. మా సినిమాల ద్వారా వచ్చే లాభాలను ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తాం. మా తదుపరి చిత్రం ‘కంచర్ల’ సంక్రాంతికి విడుదలవుతుంది’ అని చెప్పారు. హీరో ఉపేంద్ర మాట్లాడుతూ ‘నేను హీరోగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు, ఆయన బృందం అండగా నిలిచారు. అలాగే నేను ఈ రోజున ఈ వేదికపై నిలబడడానికి కారకులైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నటన పరంగా నన్ను, నా సినిమాను మీడియా మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రోత్సాహం నా రాబోయే చిత్రాలకు ఉపయోగపడుతుంది. మీ అందరి ఆశీస్లులతో మరింత మంచి పేరు తెచ్చుకుంటాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రంలోని నటీనటులతో పాటు దర్శకుడు ఆర్యన్, సహ నిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత కూడా పాల్గొన్నారు.