బాలనటుడిగా మర్చిపోలేని పాత్రలు పోషించిన జూనియర్ మహమ్ముద్(67) శుక్రవారం కన్నుమూశారు. ఆయన అసలు పేరు నయీమ్ సయ్యద్ పేరును మహమ్ముద్.. గత కొద్ది రోజులుగా పొట్టకు సంబంధించిన క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ముంబైలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు హస్న్‌న్ సయ్యద్ వెల్లడించారు. ‘మోహబ్బత్ జిందగి హై’(1966) చిత్రంతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన పేరుని కామెడీ ఐకాన్ మహమ్ముద్....జూనియర్ మహమ్ముద్‌గా పేరు మార్చారు. వీరిద్దరూ కలిసి ‘సుహాగ్ రాత్’ సినిమాలో నటించారు. ‘కార్వాన్’, ‘బ్రహ్మచారి’, ‘మై నేమ్ ఈజ్ జోకర్’ లాంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఏడు భాషల్లో 275కుపైగా చిత్రాల్లో నటించారు. పలు సీరియళ్లతోనూ మెప్పించారు. మరాఠీలో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ వ్యవహరించారు. ఆయన మరణం హిందీ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా బాలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ‘మంచి నటుడిని కోల్పోయాం. చాలా బాధగా ఉంది. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ‘జూనియర్ మహమ్ముద్ నాకెంతో ఆప్తుడు. అప్పట్లో పలు సినిమా టికెట్లు ఎక్కువ అమ్ముడయ్యేందుకు కారణం ఈయనే’’ అని జానీ లీవర్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.